ప్రజాశక్తి-రేపల్లె: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పట్టణ కేంద్రంలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసు కోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక అధికారి వై సాంబశివరావు ఆధ్వర్యంలో రాధాకృష్ణ పేరడైజ్ అపార్ట్మెంట్లో మాక్‌డ్రిల్ నిర్వహించారు. వివిధ రకాల అగ్ని ప్రమాదాలు వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలు, ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదం జరిగినప్పుడు వివిధ రకాల పరికరాల వాడకం పై అవగాహన కల్పించారు. గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయినప్పుడు భయపడకుండా దుప్పటిని తడిపి సిలిండర్ చుట్టూ కప్పి ఆర్పే ప్రయత్నం చేయాలని అగ్నిమాపక అధికారి అవగాహన కల్పించారు. ఎలక్ట్రికల్ ఫైర్ జరిగినప్పుడు ప్రథమంగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత సంబంధిత ఫైర్‌ను ఆర్పడానికి ప్రయత్నించాలని తెలిపారు. విద్యుత్ ప్రవహి స్తున్న వైర్లపై అత్యవసర పరిస్థితులలో కార్బన్ డయాక్సైడ్ ఎక్సటింగుషర్ ఉపయోగించాలని, ఫైర్ ఇవాక్యుయేషన్ డ్రిల్లును ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలని, పరిసరాల శుభ్రతను పాటిస్తూ ఆవరణలో చెత్తాచెదారం పోగు పడకుండా చూడాలని సూచించారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే 101కి కాల్ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.










