Dec 21,2022 22:41

ఫోరస్‌ ఘటనను తలపించిన ఫుడ్‌ఫ్యాట్స్‌ ప్రమాదం
ఐదుగురు కార్మికులకు గాయాలు : మరొకరి ఆచూకీ గల్లంతు
ఎగసిన మంటలతో తాడేపల్లిగూడెం ప్రాంతవాసులు బెంబేలు
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి కారుమూరి, అధికారులు
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : సిఐటియు
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం/ఉంగుటూరు

సమయం మధ్యాహ్నం మూడు గంటలు.. గంట క్రితమే విధుల్లోకి వచ్చిన కార్మికులంతా తమ పనుల్లో బిజీగా ఉన్నారు.. ఒక్కసారిగా భారీ పేలుడు.. ఎగసిపడిన అగ్నికీలలు.. తేరుకునేలోపు ఫ్యాక్టరీని చుట్టుముట్టిన మంటలు.. కార్మికులంతా ఉరుకులు..పరుగులు.. అరుపులు.. కేకలు.. ఇదీ తాడేపల్లిగూడెం పట్టణ శివారులోని పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామ పరిధిలో ఫుడ్‌ఫ్యాట్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ ఫ్యాక్టరీలోని ఎస్‌ఎఫ్‌-1 సాల్వెంట్‌ ప్లాంట్‌లో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ప్రమాదం తీరు. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు, కార్మికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఫుడ్‌ఫ్యాట్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌లో బుధవారం మధ్యాహ్నం కార్మికులు రెండో షిఫ్టులో చేరిన కొద్దిసేపటికే ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని ఎస్‌ఎఫ్‌-1 సాల్వెంట్‌ ప్లాంట్‌లో మధ్యాహ్నం 3.20 గంటలకు పేలుడు సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పరిశ్రమలో ఇతర విభాగాల్లో పని చేస్తున్న కార్మికులు, తాడేపల్లిగూడెం ప్రాంతవాసులు ఉలిక్కిపడ్డారు. మంటలు ఉధృతంగా ఎగసిపడటంతో అటువైపు ఎవరూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆ ప్లాంట్‌లో పని చేస్తున్న ఆరుగురిలో ఐదుగురు గాయాలతో బయట పడగా మరొకరి ఆచూకీ గల్లంతైంది.

సాల్వెంట్‌ ప్లాంటులో కార్మికులు మూడు షిఫ్ట్‌లుగా పని చేస్తారు. మధ్యాహ్నం షిఫ్టులో తాడేపల్లిగూడేనికి చెందిన కె.చరణ్‌ (32), అలంపురానికి చెందిన తాళ్లూరి దుర్గాప్రసాద్‌ (30), తణుకుకు చెందిన కోన నాగబాబు (41), జగన్నాధపురానికి చెందిన గడ్డం బాబ్జి (32), జార్ఘండ్‌కు చెందిన సునీల్‌కుమార్‌ గాయాల పాలయ్యారు. వీరిలో చరణ్‌, దుర్గాప్రసాద్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం రాజమండ్రి తరలించారు. కుంచనపల్లికి చెందిన మల్లికార్జునరావు ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈయన పేలుడు సంభవించిన ప్రాంతానికి అతి సమీపంలో ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడే అవకాశం లేదని అంచనా. అదే ప్లాంట్లో ఇన్సులిన్‌ పని చేస్తున్న ఏడుగురు కార్మికులు పేలుడు సమయానికి కొన్ని నిమిషాల ముందు టీ తాగేందుకు వెళ్లడంతో వారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద విషయం తెలియగానే తాడేపల్లిగూడెం అగ్నిమాపక శాఖ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే సాయంత్రం కావడం, చీకటి అలుముకోవడం, ప్రమాదం సంభవించిన ప్లాంట్‌ కుప్పకూలే ప్రమాదం ఉండటంతో ఎవరూ లోపలికెళ్లకుండా ఆ ప్రాంతాన్ని సీజ్‌ చేశారు. సమాచారం తెలియగానే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో పాటు కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌, ఆర్‌డిఒ దాసి రాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఆ ప్లాంట్‌ వద్దకు ఎవరూ వెళ్లకుండా సీల్‌ వేశామని, గురువారం ఉదయం సంబంధిత శాఖల అధికారులు, ఫోరెన్సిక్‌ నిపుణుల సాయంతో ప్లాంట్‌లోకి వెళ్లి ఆచూకీ తెలియని కార్మికుని గురించి, ప్రమాదానికి గల కారణాలపై విచారణ సాగిస్తామని వారు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్‌ పరిశీలించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : సిఐటియు
ఫుడ్‌ఫ్యాట్స్‌ పరిశ్రమలో ప్రమాద ఘటనలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు, జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. వారు ప్రమాదస్థలాన్ని సందర్శించి కార్మికులతోను, ఫ్యాక్టరీ యాజమాన్యంతోనూ, అధికారులతోనూ మాట్లాడారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి కారణాలు గుర్తించాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆచూకీ తెలియకుండా పోయిన కార్మికుని వివరాలు వీలైనంత త్వరగా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
పరిశ్రమల్లో ప్రమాద ఘంటికలు
ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని ఫోరస్‌ కంపెనీలో కొన్ని నెలల క్రితం పేలుడు సంభవించి 12 మంది కార్మికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఫుడ్‌ఫ్యాట్స్‌లో బుధవారం చోటుచేసుకున్న ప్రమాదంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమలో పని చేయడానికి తమ వారు ఎలాగున్నారోనని కార్మికుల కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో పరిశ్రమ వద్దకు పరుగులు తీశారు. ఒక కార్మికుని ఆచూకీ తెలియకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. అదే సమయంలో రాజమండ్రి తరలించిన చరణ్‌, దుర్గాప్రసాద్‌ కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. మొగల్తూరులో ఆనంద రొయ్యల పరిశ్రమలో కార్మికుల మృతువాత తర్వాత పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటూ కార్మికులు మృత్యువాత పడటం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్‌ కోడ్‌లుగా మార్చడంతో పరిశ్రమలపై పర్యవేక్షణ సంబంధిత శాఖల నుంచి పూర్తిగా కొరవడింది. ఫలితంగా వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.