Feb 17,2023 23:58

యమునశ్రీ మృతదేహం

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
రంపచోడవరం ఏజెన్సీ దేవీపట్నం మండలం ముసినిగుంట గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత ఆశ్రమ విద్యార్థినుల మరణాలు ఆగలేదు. ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పెనికిలపాడు గ్రామానికి చెందిన పి.యమునశ్రీ (12) కాకినాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో గురువారం రాత్రి మృతి చెందింది. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న యమునశ్రీని గురువారం ఉదయం కాకినాడ జనరల్‌ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించి రాత్రి మరణించింది. గత గురువారం (ఫిబ్రవరి 9న) రాత్రి ఇదే పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని కానెం ఈశ్వరి దేవి అనారోగ్యంతో కాకినాడ జనరల్‌ ఆసుపత్రిలోనే మృతి చెందిన విషయం పాఠకులకు విధితమే. ఇది జరిగి వారం రోజులకే మరో విద్యార్థిని మృత్యువాత పడడంతో పాటు, ఇదే పాఠశాలలో చదువుతున్న మరో 9మంది విద్యార్థినులు అనారోగ్యంతో బాధపడుతూ రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ పాఠశాల విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జనరల్‌ ఆసుపత్రిలో యమునశ్రీని చూడటానికి వచ్చిన హాస్టల్‌ వార్డెన్‌, పాఠశాల ఉపాధ్యాయులను తల్లిదండ్రులు, గ్రామస్తులు నిలదీశారు. ఈ పాఠశాలలో సుమారు 258 మంది విద్యనభ్యసిస్తుండగా వారిలో సగానికి పైగా విద్యార్ధినులను వారి తల్లిదండ్రులు పాఠశాల నుండి ఇళ్ళకు తీసుకెళ్లిపోయారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మృతురాలి కుటుంబానికి గిరిజన సంఘం నాయకుల పరామర్శ
విద్యార్థిని మరణ విషయం తెలుసుకున్న గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, జిల్లా నాయకులు ఈ.సిరిమల్లెరెడ్డి, సిఐటియు నాయకులు ఎం వాణిశ్రీ, కె శాంతి రాజు శుక్రవారం బాలిక కుటుంబ సభ్యుల ను పరామర్శించి, ఓదార్చారు. మరణానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ విద్యార్థినుల మరణాలకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ పాఠశాలలో ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నా ఉన్నతాధికారులు కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు.
ఎమ్మెల్యే ధనలక్ష్మి పరామర్శ
మృతి చెందిన బాలిక కుటుంబ సభ్యులను రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి శుక్రవారం మండల ప్రజా ప్రతినిధులతో కలసి పరామర్శించారు. బాలిక మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని మృతి విచారకరమని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తెలిపారు.
ఐటిడిఎ వద్ద గిరిజన సంఘం నిరసన
హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్‌
రంపచోడవరం : ముసినిగుంట ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన మరో గిరిజన విద్యార్థి చనిపోవడం, 9 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు డిమాండ్‌ చేశారు. గిరిజన సంఘం ఆధ్వర్యాన శుక్రవారం రంపచోడవరం ఐటిడిఎ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల హెచ్‌ఎం, సిబ్బంది అధిక నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే ఇద్దరు చనిపోవడంతో పాటు 9 మంది రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలోనూ, మరో ఇద్దరు రాజమండ్రి ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నారని తెలిపారు. పిల్లలకు ఆరోగ్య భద్రత కల్పించకుండా పాఠశాలలో చదువుతున్న మిగిలిన వారిని హెచ్‌ఎం ఇళ్లకు పంపించడం జరుగుతుందని తెలిపారు. చనిపోయిన విద్యార్థినుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్‌ఎంలను నియమించాలని, తరచూ వైద్య పరీక్షలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఈతపల్లి సిరిమల్లిరెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.వాణిశ్రీ, కె.శాంతి రాజు, ఎం.రమేష్‌, ఎవిఎస్‌పి నాయకులు చవలం రాంబాబు, కురసం వరలక్ష్మి, బోరగ వీరాయ్యమ్మ, పూసం బాలుదొర తదితరులు పాల్గొన్నారు.