బొర్రమామిడిలో నాలుగు నెలల పాప మృతి
కొద్దిరోజుల్లో ఇదే గ్రామంలో నలుగురు మృత్యువాత
చిన్నారుల మరణాలను అరికట్టడంలో వైఫల్యంపై ఆందోళన
ప్రజాశక్తి-హుకుంపేట:మన్యంలో శిశుమరణాలకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. నిత్యం ఏదో ఒక గ్రామంలో ఎవరో ఒకరు ఏదో రూపాన మృత్యువాత పడుతుండడంతో ఆందోళన వ్యక్తమౌతోంది. శిశుమరణాలను అరికట్టేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న చర్యలను ప్రశ్నిస్తూ, శిశుమరణఘోష కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హుకుంపేట మండలం బి బొడ్డపుట్టు పంచాయితీ బొర్ర మామిడి గ్రామానికి చెందిన చీకటి సోమన్న, విజయలక్ష్మి దంపతుల నాలుగు నెలల పాప గురువారం మృత్యువాత పడింది.ఉన్నట్టుండి పాలు తాగడం మానేసి, అదేపనిగా పాప ఏడుస్తుండడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే 108 రాకపోవడంతో ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యపొందుతూ ఆరోగ్యం విషమించడంతో మృత్యువాత పడింది. శిశుమరణాలు అగకుండా జరగడం, ఏ కారణాన వారు చనిపోతున్నారో తెలియని స్థితిలో బాధిత తల్లిదండ్రులతోపాటు మన్యవాసులు ఆందోళన చెందుతున్నారు బి బొడ్డపుట్టు గ్రామపంచాయతీ పరిధిలో గడచిన కొంతకాలంగా పదిమంది చిన్నారులు మరణిస్తే, ఒక్క బొర్ర మామిడి గ్రామంలోనే నలుగురు చిన్నారులు కొద్దికాలంలో మరణించారని గ్రామస్తులు అంటున్నారు. శిశు మరణాల అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.










