Nov 05,2023 00:34

పెదకాకాని వద్ద గతంలో అధికారులు స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేషన్‌ బియ్యం దారి మళ్లుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. తెలంగాణ, కర్నాటక, గుజరాత్‌,తమిళనాడు రాష్ట్రాలకు ఎక్కువగా వీటిని ఎగుమతి చేస్తున్నారు. రేషన్‌ డీలర్ల హయంలో బియ్యం దారిమళ్లితున్నాయన్న ఆరోపణలతో ఇంటింటికి నాణ్యమైన బియ్యం పేరుతో ఎమ్‌డియూ వాహనాల ద్యారా రేషన్‌ బియ్యం సరఫరా చేస్తున్నా అక్రమ రవాణా ఆగడం లేదు. రైసు మిల్లర్లు వీటిని నేరుగా కొనుగోలుచేసి పాలిష్‌ పట్టి వేర్వేరు సంచుల్లోకి మార్చి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇటీవల చేబ్రోలు వద్ద గుజరాత్‌కు రేషన్‌ బియ్యం తరలిస్తుండగా విజిలెన్సు అధికారులు పట్టుకున్నారు. పల్నాడు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమిళనాడు, తెలంగాణకు తరలివెళ్తున్నాయి. డెల్టాలోని పలు మండలాల నుంచి కర్నాటక, గుజరాత్‌కు వెళ్తున్నాయి. కర్లపాలెం మండలం నుంచి ఎక్కువగా గుజరాత్‌కు రేషన్‌ బియ్యం తరలివెళ్తున్నట్టు అధికారులు గుర్తించారు. రెండునెలల క్రితం కూడా ఇదే ప్రాంతం నుంచి గుజరాత్‌కు భారీగా బియ్యం తరలిస్తుండగా విజిలెన్సు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వాహనాల్లో ఇంటివద్దకు రేషన్‌ సరఫరా జరుగుతున్నా ఇందుకు సంబంధించి వాహనాల నిర్వహాకులే రేషన్‌ అక్రమ రవాణాలో కీలక భూమిక పోషిస్తున్నారు. బియ్యం కార్డు దారుల నుంచి బయోమెట్రిక్‌ తీసుకున్న తరువాత తూకం వేసి బియ్యం అందిస్తున్నట్టు ఆన్‌లైన్‌లో నమోదు చేసి వెంటనే వినియోగదారులకు బియ్యం బదులు సొమ్ములు ఇచ్చిపంపుతున్నారు. రేషన్‌ బియ్యం వాహనాల్లో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి భారీగా రవాణా అవుతున్న సమయంలోనే పోలీసులు, విజిలెన్సు అధికారులు ఎక్కువగా పట్టుకుంటున్నారు. కానీ వాహనదారులే కార్డు దారులకు బియ్యం బదులు సొమ్ము ఇచ్చి ఆన్‌లైన్‌లోనే అక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖాధికారులు వాహనదారుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటూ అక్రమాలపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
రేషన్‌ బియ్యాన్ని కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతంలో కంటే మెరుగైన బియ్యాన్ని ఇస్తున్నామని వినియోగదారులు వీటిని అన్నంగా వండుకుని భుజిస్తున్నారని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి. రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ చేసి నాణ్యమైన సరుకుగా చూపి ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్‌లో బియ్యం ధరలు పెరగడం వల్ల వాహనదారులు వినియోగదారులకు కిలో రూ.10 నుంచి రూ.12 వరకు చెల్లిస్తున్నారు. మిల్లర్లు వీటిని పాలిష్‌ చేసి కిలో రూ.40లకు విక్రయించే వాటిల్లో కలుపుతున్నారు. ఈ విధంగా రేషన్‌ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. రకరకాల కారణాల వల్ల రైస్‌ తినడం తగ్గించడం వల్ల చాలా మంది నాణ్యమైన బియ్యంలో పాలిష్‌ పట్టిన రేషన్‌ బియాన్ని కలిపినా కనుగొనలేకపోతున్నారు. హోటళ్లు, మెస్‌లకు సరఫరా అయ్యే బియ్యంలో ఈ తరహా సరకు ఎక్కువగా ఉంటోంది.
జిల్లాలో ప్రజా ప్రతినిదుల అండతోనే రేషన్‌బియ్యం దారిమళులతున్నాయని తెలిసింది. ఇతర రాష్ట్రాలకు రేషన్‌ బియ్యం తరలిపోతుండగా ఇప్పటికే పలుమార్లు పోలీసులు, విజిలెన్సు అధికారులు వేర్వేరుగా వీటిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. అయితే రేషన్‌ మాఫీయాలోని కొంతమంది వ్యక్తుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు అక్రమ రవాణ వ్యవహారాలు విజిలెన్సు, పోలీసులకు కొంత మంది వ్యక్తులు సమాచారం ఇస్తున్నారని, మాఫియాలో ముఠాల మధ్య ఒప్పందాలు జరిగితే గుట్టుచప్పుడు కాకుండా తరలిపోతున్నాయని తెలిసింది. వినియోగదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని మిల్లర్లకు, ఇతర అక్రమార్కులకు అమ్ముకుంటున్నారు. వారి నుంచి రూ.30పైన గరిష్టంగా రూ.40 వరకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.