Jan 13,2023 23:51

ఆర్థిక సాయం అందజేస్తున్న లోదొడ్డి గ్రామ సర్పంచ్‌ లోతా రామారావు

రూ1,50 లక్షలు ఆస్తి నష్టం
ప్రజాశక్తి-రాజవొమ్మంగి

మండలంలోని లోతట్టు పంచాయితీ లోదొడ్డి గ్రామంలో గురువారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో జర్తా గంగ అనే గిరిజన మహిళకు చెందిన తాటాకు ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ1.50 లక్షలు ఆస్తి నష్టం సంభవించింది. బాధితుల కథనం ప్రకారం... లోదొడ్డి గ్రామ శివారులో చేనుమకాల్లో నివాసం ఉంటున్న జర్తా గంగ కుటుంబం గురువారం రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చలి నుండి ఉపశమనం పొందేందుకు లగడీలు వేసుకుని నిద్రపోయారు. ఈ నేపథ్యంలో దుప్పటికి నిప్పంటుకొని మంటలు వ్యాపించి ఇంటికి అంటుకున్నాయి. దీంతో గంగ కుటుంబీకులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. మంటలను అదుపుచేసే అవకాశం లేకపోవడంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ అగ్ని ప్రమాదంలో గంగ కుటుంబానికి చెందిన బట్టలు, ఫర్నిచర్‌, బీరువా, డబ్బులు తదితర వస్తువులు కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌ లోతా రామారావు శుక్రవారం గంగ కుటుంబాన్ని పరామర్శించి బియ్యం, కొంత డబ్బు ఆర్థిక సహాయం అందజేశారు. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి రోడ్డున పడిన బాధితు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌ రామారావు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు పొత్తూరు లోవరాజు, బూసరి సత్తిబాబు పాల్గొన్నారు.