రాయచోటి : జిల్లాలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అగ్ని ప్రమాదాలను నివారించడమే తమ లక్ష్యమని జిల్లా అగ్నిమాపక అధికారి టి. అనిల్ కుమార్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో రాబోయే దీపావళి పండగ సందర్భంగా ప్రమాదాలను చోటు చేసుకోకుండాఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖా ముఖిలో ఆయన వివరించారు.
అన్నమయ్య జిల్లాలో అగ్నిమాపక కేంద్రాల వివరాలు తెలపండి?
జిల్లాలో రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట, రైల్వే కోడూర్, పీలేరు, వాల్మీ కిపురం, మదనపల్లె ,ములకలచెరువు ప్రాంతాలలో అగ్నిమాపక కేంద్రాలున్నాయి 8 వాహనాలు,1 జీపు,1బుల్లెట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
జిల్లాలో బాణాసంచా ఫ్యాక్టరీలు ఎన్ని ఉన్నాయి?
జిల్లాలో 24 లైసెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రాయచోటిలో 10, లక్కిరెడ్డిపల్లెలో 3, రాజంపేటలో 2, రైల్వే కోడూరులో 2, వాల్మీకిపురంలో 1, పీలేరులో 3,మొలకలచెరువులో 1, మదనపల్లె 2 చొప్పున బాణా సంచా ఫ్యాక్టరీలున్నాయి.
ఫైర్ ఆఫీసర్లు పని వివరాలు తెలపండి?
ఫైర్ ఆఫీసర్లు వివిఐపి స్టాండ్ బై, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, గవర్నర్, జెడ్ ప్లస్ కేటగిరి తదితర స్టాండ్ బై డ్యూటీకి హాజరవుతారు. ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సులు నిర్వహించడం, 24 గంటలు ప్రజలకు సిబ్బంది అందుబాటులో ఉండడం, పెట్రోల్ బంక్, గ్యాస్ గోడెన్ సినిమా థియేటర్లు పాఠశాలలో ఆసుపత్రులు ఫ్యాక్టరీలకు అగ్నిమాపక శాఖ వారు ఎన్‌ఒసి సర్టిఫికెట్ మంజూరు చేయడం జరుగుతుంది.
ఫైర్ మేన్‌లకు ఎలాంటి శిక్షణలు ఇస్తారు?
ఫైర్ మెన్‌లు అగ్ని మాపక కార్యాలయంలో విధుల్లో చేరేటప్పుడు నాలుగు మాసాల పాటు శిక్షణ ఇస్తారు. స్విమ్మింగ్ శిక్షణ తర్వాత గోవా, బెంగళూరు, ఒరిస్సా ప్రత్యేక శిక్షణకు పంపిస్తారు. నాగపూర్‌లో ట్రైనింగ్ ఇస్తారు.
దీపావళి పండుగ సందర్భంగా ఎన్ని షాపులకు అనుమతులు ఇస్తున్నారు?
దీపావళి పండుగ సందర్భంగా జిల్లా వ్యాపతంగా తాత్కాలికంగా 330 దరఖాస్తులు వచ్చాయి. వన్ మెన్ కమిటీ ప్రకారం స్థానిక తహశీల్దార్, పోలీస్ స్టేషన్, ఎపి ఎస్‌పి డిసిఎల్ , ఫైర్ సిబ్బంది గ్రౌండ్‌ను ఎంపిక చేస్తాం. వీరు నిర్దేశించిన గ్రౌండ్‌లో షాపులను ఏర్పాటు చేసుకోవాలి. షాపులను ఐరన్ రేకులతో ఏర్పాటు చేసుకోవాలి ప్రతి షాప్‌కూ మూడు మెటర్లు దూరం ఉండాలి. ఎదురు ఎదురుగా ఉండకూడదు. ప్రతిషాపు నందు రెండు పైర్ సిలిండర్లు, రెండు వాటర్ డ్రమ్ములు తగినంత ఏర్పాటు చేసుకోవాలి. నో స్మోకింగ్ బోర్డును ఏర్పాటు చేసుకోవాలి. పార్కింగ్ స్థలం దూరంలో ఏర్పాటు చేసుకోవాలి.
టపాసులు పేల్చే సమయంలో ప్రజలకు మీర్చే సలమాలు, సూచనలు?
టపాకాయల ప్యాకెట్ మీద రాసి ఉన్న జాగ్రత్తలు కచ్చితంగా పాటించవలెను. టపాసులు కాల్చే సమయంలో నీటి బకెట్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. టపాకాయలను విశాలమైన మైదానంలో కాల్చాలి. పూరిగుడిసెలు, ఇతర ప్రమాదకర ప్రాంతాల్లో కాల్చరాదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వాలి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో దీపాల పండుగ జరుపుకోవాలి.
సిబ్బంది కొరత ఏమైనా ఉందా?
జిల్లా వ్యాప్తంగా 8 ఫైర్ స్టేషన్లు ఉండగా ఆరుగురు ఫైర్ ఆఫీసర్లు ఉన్నారు. 2 ఖాళీగా ఉన్నాయి. డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు 24 ఉండగా 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫైర్ మాన్లు 72 మంది ఉండగా 33 మంది ఉన్నారు. 39 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 22 మంది హౌంగార్లు ఉన్నారు.