Apr 16,2023 01:38
అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక అధికారి వి రామకృష్ణ

ప్రజాశక్తి-చీరాల: అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చీరాల అగ్నిమాపక కేంద్రం అధికారి వి రామకృష్ణ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శనివారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ఎంజీసీ మార్కెట్‌ గడియారస్తంభం కూడలిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పాయింట్ల ఓవర్‌ లోడ్‌ వేయరాదని, ఇంటి నుంచి ఎక్కువ రోజులు బయటకు వెళ్లినప్పుడు కరెంటు మెయిన్ను తప్పనిసరిగా ఆపివేయాలని తెలిపారు. కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలను ఆర్పివేసి పడేయాలని సూచించారు. ఎలక్ట్రిక్టల్‌ ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగితే ఆర్పివేసేందుకు కొంత నీటిని ఇంట్లో ఉంచుకోవాలన్నారు. మీ దుస్తులకు నిప్పు అంటుకుంటే పరిగెత్తకుండా నేలపై దొర్లడం కానీ లేక దుప్పటి, ఇతర వస్త్రాలను చుట్టుకోవాలని చెప్పారు. గడ్డివాములు నివాసాలకు దూరంగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలని, అగ్నిప్రమాదాలు జరుగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
రేపల్లె: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని రైల్వే స్టేషన్‌, ప్రధాన రహదారుల్లో అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా నివారించాలి అనే విషయంపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫైర్‌ సిబ్బంది పాల్గొన్నారు.