Oct 25,2023 20:26

బాధితులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి

ప్రజాశక్తి- శృంగవరపుకోట : పట్టణంలోని స్థానిక బాలికోన్నత పాఠశాల ఎదురుగా ఉన్న భరిణెలు తయారు చేస్తూ జీవనం కొనసా గిస్తున్న చేతి వృత్తిదారుల ఇంటిలో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న టిడిపి నియోజకవర్గ ఇంఛార్జ్‌ కోళ్ల లలిత కుమారి బుధవారం బాధితులను కలిసి పరామర్శించారు. అనంతరం అగ్ని ప్రమాదం గల కారణాలను భాదితులను అడిగి తెలుసుకున్నారు. ఆమెతోపాటుగా టిడిపి నాయకులు అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. బాధితులు కందాల చంద్రరావు దంపతులు ఇచ్చిన వివరాలు ప్రకారం మంగళవారం ఉదయం పై ఇంటిలో నుండి ఒక్కసారిగా దట్టమైన పొగ వస్తుండడంతో స్థానికులు చూసి చెప్పగా కొందరు అగ్నిమాపకాధికారులకు సమాచారాన్ని చేరవేయగా, మరికొందరు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేశారన్నారు. అంతలోనే జరగరాని ఘోరం జరిగిపోయిందని బాధితులు మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటిలో ఉన్న ఏసీలు, రిఫ్రిజిరేటర్‌, టీవీలు, మంచాలు, బీరువాలు, వంట సామాగ్రిలుతో పాటు అన్నీ అగ్నిప్రమాదంలో కాలి బూడిదయ్యాయని వాపోయారు. ఈ సందర్భంగా లలిత కుమారి తక్షణ ఆర్థికసాయం రూ.5వేలు అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు జీ.ఎస్‌. నాయుడు,ఉపాధ్యక్షులు సరిపల్లి రామకృష్ణ, మాజీ ఎంపిపి రెడ్డి వెంకన్న, మాజీ వైస్‌ ఎంపిపి నానిగిరి రమణాజీ, నాయకులు కోనేదం మల్లేశ్వరరావు, పొట్నూరు అప్పలరాజు, విశాఖ పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి కాపుగంటి శ్రీనివాసు, చక్కా కిరణ్‌ కుమార్‌, గనివాడ బంగారు నాయుడు, అనకాపల్లి చెల్లయ్య, వాకాడ బాల ఈశ్వర్‌ భరత్‌ (బాలు), పెదగాడ రాజు, బుత్తల సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.