ప్రజాశక్తి-కె.కోటపాడు : మండలం సింగన్న దొరపాలెం గ్రామంలో ఇటీవల అగ్నిప్రమాదంలో నష్టపోయిన రొంగలి అక్కు నాయుడు కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ మాడుగుల నియోజకవర్గ నాయకులు పైలా ప్రసాదరావు బుధవారం పరామర్శించారు. జనవరి 27న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో అక్కునాయుడుకు చెందిన పాడి పశువు మృత్యువాత పడగా, రెండు మూగజీవాలు తీవ్రంగా గాయపడ్డాయి. గడ్డిలో నిల్వ ఉంచిన ధాన్యం నిల్వలు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న పైలా ప్రసాదరావు బుధవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబంతో మాట్లాడారు. వారికి ప్రసాదరావు రూ.5 వేలు, ఆ గ్రామ సర్పంచ్ వెలగల పైడంనాయుడు రూ.5 వేలు మొత్తం రూ.10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి పిల్లల రమణ, నాయకులు గొర్లె దేముడు, పైలా పైడం నాయుడు, ముత్యాల నాయుడు, జాగారపు అప్పలనాయుడు, రొంగలి రమణేశ్వరరావు పాల్గొన్నారు.










