ప్రజాశక్తి -యు.కొత్తపల్లి ఉప్పాడలో ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదంలో బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని మాజీ ఎంఎల్‌ఎ ఎస్‌విఎస్‌ఎన్.వర్మ భరోసా ఇచ్చారు సోమవారం నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. బాధిత మత్స్యకారులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు సబ్సిడీలో వలలు ఇచ్చే వాళ్ళమని తెలిపారు. ఉప్పాడలో ఎక్కడ చూసినా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, దాని ద్వారా విష జ్వరాలు బారిన మత్స్యకారులు పడుతున్నారని తెలిపారు. గడపగడపకు వస్తున్న ఎంఎల్‌ఎలను సమస్యలపై అడిగితే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అనిశెట్టి సత్యానందరెడ్డి, చోడిపల్లి ప్రసాద్, సనపయ్య, మత్స్యకార నాయకులు పెద్దలు పాల్గొన్నారు.










