ప్రజాశక్తి -హుకుంపేట:మండల కేంద్రంలోని రోజు రోజుకి అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలను ధిక్కరించి శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారుల సెలవు రోజులు చూసుకొని మరుసటి రోజు కల్లా శ్లాపులు నిర్మాణాలు చేపడుతున్నారు. గత నాలుగు రోజులుగా దీపావళి సెలవు కావడంతో గిరిజనేతరులు పెట్రేగి పోతున్నారు. మండలం కేంద్రలోని రాళ్ళు గెడ్డ సమీపంలో అక్రమ కట్టడాలను రాజు అనే వ్యక్తికి చేపడుతున్నాడు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేపట్టకూడదని, నిలుపుదల చేయాలని స్థానిక తహసిల్దార్ రాజ్యలక్ష్మి మంగళవారం హెచ్చరించారు.అయినా బుధవారం శ్లాబ్ వేయడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. నిబంధనలకు విరోధంగా చేపడుతున్న నిర్మాణాలను ప్రభుత్వ పరంగా చర్యలకు తప్పవని ఆమె పేర్కొన్నారు. అక్రమణదారులకు పలుమార్లు నిలుపుదల చేయాలని హెచ్చరించినా అధికారులు లేని పక్షంలో నిర్మాణం చేసుకుంటున్నారని ఆమె అన్నారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టికి తెలియజేస్తామన్నారు.
అక్రమ నిర్మాణాలు అధికారుల కనుసున్నల్లోనే జరుగుతున్నాయని ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి టి.కృష్ణారావు తెలిపారు. పునాది లెవెల్‌లో ఉన్నప్పుడు ఫిర్యాదు చేసినా ఒక్క అక్రమ నిర్మాణం నిలుపుదల చేయలేదన్నారు. నిర్మాణం చేపట్టిన వారిపై ఎన్టీఆర్ కేసు ఒక్కటి కూడా నమోదు చేయలేదని ఆయన మండిపడ్డారు. ఫిర్యాదు చేసిన ఏ ఒక్క కట్టడాన్ని కూడా నిలుపుదల గాని ఎన్టీఆర్ కేసు గాని నమోదు చేసిన పాపాన పోలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు మేల్కొని అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు మనుగడ లేకుండా పోతుందన్నారు. నిర్మాణాలు నిలుపుదల చేసి నిర్మాణం చేపట్టిన వారిపై ఎన్టీఆర్ కేసు నమోదు చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చట్టాలకు కాపాడాలని ఆయన కోరారు. లేనిపక్షంలో గిరిజనులందరూ ఏకమై అక్రమ నిర్మాణాలు కూల్చడానికి పూనుకుంటామని ఆయన హెచ్చరించారు.