జీవితాన్ని
అనుభవాలతో వడపోసుకుని
సేద్యమే ఊపిరిగా
దేశానికి ఊపిరోస్తున్నా...!
స్వేదాన్ని
మనిషిపై ఆరేసుకుని
మనసు తడిని
దేశపు గుండెకు అంటిస్తున్నా...!
ప్రకృతిని
చేను కుదుళ్ళుగా చేసి
ఆకలి మూటను
విశ్వ గొంతుకు కడుతున్నా...!
పంట చేనుని
అన్నం కంచంగా మార్చి
మనిషి మనుగడకు ఊతమై
లోక కళ్యాణాన్ని చూపిస్తున్నా...!
ఆరిపోతున్న దేహాన్ని
బీడైన చేనులో పరిచి
రేపటి పంటను కలగనే
నిస్వార్థ చక్రవర్తిలా ముద్రపడినా...!
పంట పంటకూ మధ్య
ఆగిన గడియారంలా నిలబడి
కొత్త నారును కొత్త బ్యాటరీగా చేసి
దేశ గడియారాన్ని రీస్టార్ట్ చేస్తున్న
రైతన్న ఋణం తీర్చుకునేదెవ్వరు?!
నువ్వూ నేనూ
రైతయ్యాకా మాట్లాడుకుందాం...!
అప్పటి వరకూ
మనం ఆగిన గడియారాల్లా
దేశం మధ్యనే దిష్టిబొమ్మల్లానే ఉండిపోదాం!
కొత్తపల్లి మణీత్రినాథరాజు
99493 89296