May 22,2022 06:58

'తిండి కలిగితే కండ కలదోయ్ / కండ కలవాడేను మనిషోయ్' అంటారు గురజాడ వారు. దేశమంటే ఏమిటో... మనుషులకు ఏం కావాలో శతాబ్దం క్రితమే ఈ మహాకవి వక్కాణించారు. ఈనాటికీ గురజాడ వేదన మన పాలకులకు ఒంటబట్టలేదు. ఆహారం మనిషి ఆరోగ్యానికి, సమాజ మనుగడకు ఇంధనం. నేటి ప్రజాస్వామ్య యుగంలో ఏ ఒక్క పేగూ ఆకలితో కాలిపోకుండా కాపాడుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ప్రభుత్వాలు ఆ బాధ్యతను విస్మరించడం వల్ల ప్రపంచం ఆకలితో అలమటిస్తోంది. 'అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు' అంటాడు ఆత్రేయ. రాళ్లెత్తిన కూలీల శ్రమశక్తితో, చిందిన రక్తాశ్రువులతో ప్రపంచం అభివృద్ధి చెందడం ఎంత నిజమో, ఆ అభివృద్ధికి కారణమైన శ్రామికశక్తి ఆకలి కేకలూ అంతే నిజం. విచిత్రమేమిటంటే.. 'తామే భువి కధినాథులమని' హూంకరించి, ఘీంకరించిన సామ్రాజ్యవాద దేశాలు సైతం ప్రస్తుత సంక్షోభం ధాటికి దేహీ అనక తప్పలేదు. దాచినా దాగని సత్యమిది. 'ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి' అని ఐరాస సెక్రటరీ జనరల్‌ చెప్పడం దీనికి సూచిక. 'సమాజంలో ఆకలి ఏ రూపంలో ఉన్నా... అది ప్రభుత్వ వైఫల్యంగా, హింసా రూపంగానే చెప్పుకోవాలి' అన్న డబ్లూహెచ్‌ఓ మాటలు ఓ హెచ్చరిక.
    వాతావరణంలో నెలకొంటున్న మార్పుల ప్రభావం వల్ల ఆహార కొరత ఏర్పడుతుందని, కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటించాల్సి వస్తుందని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. 2030 నాటికి 9.06 కోట్ల మంది భారతీయులు ఆహార సంక్షోభం ఎదుర్కోబోతున్నారని 'గ్లోబల్‌ పాలసీ నివేదిక 2022' పేర్కొన్నది. 2030 నాటికి మన దేశ ఆహార ఉత్పత్తి 16 శాతం తగ్గి, ఆకలి తీవ్రత 23 శాతం పెరగనుందని 'అంతర్జాతీయ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌' ఇటీవల వెల్లడించింది. 2050 నాటికి కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తారని, పోషకాహార లోపం, పేదరికం లాంటి సమస్యలు తీవ్రమవుతాయని నివేదిక చెబుతోంది. వాస్తవానికి ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాలలో 101వ స్థానం మనది. ప్రపంచంలో తీవ్రమైన ఆకలి దేశాలు 31 ఉండగా, అందులో భారత్‌ కూడా ఒకటి. భారత్‌ నేడు 'తీవ్ర స్థాయి ఆకలి కలిగిన' దేశాల సరసన చేరింది. ఎత్తుకు తగ్గ బరువుకన్నా తక్కువ బరువు కలిగిన అత్యధిక బాలలున్న దేశాల సరసన మనమూ నిలిచాము. బాలబాలికల్లో పౌష్టికార లోపం, శిశుమరణాల రేటు ఆందోళనకర స్థాయిలో పెగుతోందని 'జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5' తేల్చింది. ప్రస్తుతం దేశం ద్రవ్యోల్బణం గుప్పెట్లో నలుగుతోంది. ఆహార ధరలు అధికంగా పెరిగి...పేదలు మరింతగా ఆకలి బారిన పడే ప్రమాదముంది. ఈ వాస్తవాన్ని మరుగుపరిచేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న ప్రధాని మోడీ...'భారతదేశం ప్రపంచానికే ఆహారం అందించేందుకు సిద్ధంగా ఉంది' అంటూ ప్రకటించడం విడ్డూరం. అధిక ధరలను అరికట్టే చర్యలు వెంటనే చేపట్టడం అత్యవసరం.
     'ఆకలి అగ్గి లాంటిది. అగ్గికి యేదోక ఆహారం వెయ్యకపోతే, మనిషినే కాల్చేస్తది' అని ఓ కవి చెబుతాడు. పట్టెడన్నం కోసం పరితపించే అభాగ్యుల బతుకులను కాల్చేస్తుండటం నేటి సంక్షోభం... రేపటి మహా విషాదం. 'ఈ మట్టిలో పుట్టిన ప్రతి మనిషికీ ఆహార లభ్యత కనీస హక్కు' అంటారు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్‌ బోర్లాగ్‌. ఆ హక్కు గురించి పోట్లాడితే, న్యాయం కోసం నిలదీస్తే...కమ్యూనిస్టులనో...లేదంటే దేశద్రోహులనో ముద్రలేస్తున్నారు. మానవ సమాజ పరిణామంలోనే ఉన్నత దశగా భావించబడుతోన్న ఆధునిక యుగంలో కూడా, ఈ ఆకలి ఇంకా అధిగమించలేని సమస్యగా మిగిలిపోవడానికి ఎవరిని నిందించాలి? కోట్లాది టన్నుల ఆహార ధాన్యాలను గిడ్డంగుల్లో భద్రంగా దాచిపెడుతూ మన పాలకులు 'పందికొక్కులను' పోషిస్తున్నారు. ఈ ఆహార ధాన్యాలను పేదలకు ఉచితంగా పంపిణీ చేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. అగ్గి లాంటి ఆకలిని అదుపు చేయాలి.