అనంతపురం : నిరంతర అధ్యయనం, పరిశోధనలతో గుర్తింపు, సమాజానికి మేలు జరుగుతుందని జెఎన్‌టియు విసి రంగజనార్ధన తెలిపారు. జెఎన్‌టియు ఉపకులపతి కాన్ఫరెన్స్ హాలులో బుధవారం నాడు ''వాతావరణం-కాస్మిక్ ఎనర్జీ డిటెక్టర్‌లో గెలాక్సీ కాస్మిక్ కిరణాల రవాణా సమీకరణంపై అధ్యయనం'' అన్న అంశంపై గణిత విభాగ ఆచార్యులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విసి రంగ జనార్ధన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా డాక్టర్ ఎ.శైలాకుమారి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒక పోర్టబుల్ మ్యూయాన్ డిటెక్టర్‌ను తయారు చేయవచ్చని చెప్పారు. కాస్మిక్ కిరణాలను గుర్తించడం కోసం సీసపు షీట్‌లో రెండు గీగర్ ట్యూబ్‌లను కలిగి ఉంటాయన్నారు. సిస్టమ్ గుర్తింపు ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి, ప్రతికూల రేట్లను తగ్గించడానికి యాదచ్ఛిక సర్క్యూట్ లాజిక్‌ను ఉపయోగిస్తుందని తెలిపారు. అదనంగా, పరికరం ఉష్ణోగ్రత, తేమ, అక్షాంశం, రేఖాంశం, వాతావరణ పీడనంపై డేటాను సేకరించడానికి సెన్సార్లను కలిగి ఉంటాయని తెలిపారు. ఈ లక్షణాల కలయిక మ్యూయాన్‌లు, పరిసర వాతావరణంతో వాటి పరస్పర చర్యలను అధ్యయనం చేయడానికి సమగ్రమైన, బహుముఖ పరిష్కారాన్ని అందిస్తుంది అని తెలిపారు. కాస్మిక్ కిరణాలు, ప్రోటాన్లు, భారీ అయాన్లు వంటి అధిక-శక్తి కణాలు, క్యాన్సర్ చికిత్స కోసం రేడియేషన్ థెరపీలో ఉపయోగించే కణాలకు సమానమైన లక్షణాలను కలిగి ఉంటాయన్నారు. ప్రోటాన్ థెరపీ, కార్బన్ అయాన్ థెరపీతో సహా పార్టికల్ థెరపీ అనేది క్యాన్సర్ చికిత్స ఒక రూపం అన్నారు. ఇది క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకోవడానికి, నాశనం చేయడానికి క్రియాత్మకమైన కణాలను ఉపయోగిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు చేసినందుకు డాక్టర్ ఎ.శైలా కుమారి, వారి బందాన్ని విసి రంగజనార్ధన, రెక్టార్ ఆచార్య ఎం.విజయ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్‌వి.సత్యనారాయణలు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు భువనవిజయ, ఆర్.పద్మ సువర్ణ, రీసర్చ్ కాలర్ ఆర్.రాఘవేంద్ర పాల్గొన్నారు.










