ప్రజాశక్తి - చిలకలూరిపేట : చిలకలూరిపేటను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. చిలకలూరిపేట పట్టణం పురుషోత్తమ పట్టణంలో ఐదెకరాల దేవదాయశాఖ భూమిలో టిటిడి కళ్యాణ మండపం, వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆ ప్రాంతాన్ని మంత్రి మంగళవారం సదర్శించారు. చీరాల మండలం వాడరేవు గ్రామం కోదండరామస్వామి ఆలయానికి సంబంధించి పురుషోత్తమ పట్టణం గ్రామానికి ఆనుకుని ఐదు ఎకరాల దేవదాయశాఖ భూమి ఉందని ఈ భూమిని దేవదాయశాఖ నుంచి టిటిడికి బదలాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఆలయ నిర్మాణానికి రూ.75 లక్షలు, కల్యాణ మండపం నిర్మాణానికి రూ.2.5 కోట్లు మంజూరు చేస్తూ టిటిడి పాలకమండలి నిర్ణయించినట్లు చెప్పారు. గ్రామస్తుల భాగస్వామ్యం కింద చెల్లించాల్సిన రూ.68.75 లక్షలను తమ కుటుంబం నుంచి తామే చెల్లించామని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు పేరుతో తన భర్త కుమారస్వామి సంబంధిత చెక్కులను టిటిడికి అందజేశారని తెలిపారు. పురుషోత్తమ పట్టణంలో రూ.3 కోట్లతో వేణుగోపీనాథస్వామి ఆలయాన్ని నిర్మించామని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ.1.5 కోట్లు, టిటిడి నుంచి మరో రూ.1.5 కోట్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నానని చెప్పారు. బొప్పూడి కొండపై ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి రూ.30 లక్షలు మంజూరు చేసిందని, అదే గ్రామంలో చెన్నకేశవులస్వామి, శివాలయాల అభివృద్ధికి రూ.కోటి మంజూరయ్యాయని తెలిపారు. కొండవీడు అభివృద్ధి పనుల్లో భాగంగా లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసిందిని, చెంఘీజ్‌ఖాన్‌పేటలో వెన్నముద్ద వేణుగోపాలస్వామి ఆలయాన్ని అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని మంత్రి చెప్పారు.










