ప్రజాశక్తి- కొత్తూరు: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అర్ధశాస్త్ర అధ్యాపకుడిని నియామకం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.హరీష్, జిల్లా కమిట్ సభ్యులు ఎం.సంతోష్‌లు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. నాలుగు రోడ్లు కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కళాశాల విద్యార్థులతో శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో ఏడు జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు అందజేయాలన్నారు. మధ్యాన్నం భోజన పథకం అమలు చేయాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి పట్టకపోవడం దారుణమన్నారు. పాఠ్య పుస్తకాలు లేకపోతే విద్యార్థులు ఏ విధంగా రాణిస్తారని ప్రశ్నించారు. కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు యోహాన్, తరుణ్, దేవేంద్ర, శివ, మహేష్, సాయి, గణేష్, చెందు, కృష్ణ, సంతు, విష్ణు, నీరజన, శిరీష, మాధురి పాల్గొన్నారు.










