Jul 27,2023 22:44

ప్రజాశక్తి - యంత్రాంగం పలు మండలాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. దీంతో వాహనదాలు భయాందోళనలకు లోనవుతున్నారు. గండేపల్లి మండలంలో ప్రధాన రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. గోతులు, బురదతో వాహనదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గండేపల్లి నుంచి సింగరంపాలెం వెళ్లే రహదారి పూర్తిగా గుంతలుగా మారింది. అటుగా వెళ్లాలంటే ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. గతంలో ఇదే సమస్యపై ప్రజాప్రతినిధులు, అదికారులు మొర పెట్టుకోగా కొన్ని నెలల క్రితమే ఈ రోడ్డుకు మరమ్మతులు నిర్వహించారు. తూతూ మంత్రంగా పనులు కానిచ్చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇటీవల స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణం ప్రారంభోత్సవం జరిగింది. ఆ ఆసుపత్రికి వెళ్లాలంటే ఇదే దారివెంట వెళ్లాలి. గర్భిణులు, వృద్ధులు, క్షతగాత్రులు అటుగా వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసుపత్రికి వెళ్లేందుకు మట్టితో రోడ్డు వేసినప్పటికీ వర్షాలు వల్ల గోతులు పడి నీరు నిలిచిపోతోంది. మట్టికారణంగా రోడ్డుమోత్తం బురదగా మారింది. మోటార్‌ సైకిల్‌ వెళ్లాలంటే టైర్లు జారిపోతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. దీనిపై డాక్టర్‌ సౌమ్య మాట్లాడుతూ కొత్త రోడ్డు వల్ల ఈ విధంగా తయారైందని, విషయాన్ని సర్పంచ్‌కు, పాలకులకు, అధికారులకు తెలియజేశామని తెలిపారు.
జగ్గంపేట రూరల్‌ మండలంలోని రామవరంలో మర్రిపాక కాలనీలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆ కాలనీలోకి ఏమైనా వాహనాలు వెళ్లాలంటే ముప్పు తిప్పలు పడాల్సిందే. చివరికి రేషన్‌ వాహనం కూడా ఆ కాలనీలోకి వెళ్లడం లేదు. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఆ కాలనీ రోడ్లన్నీ చెరువుల కనిపిస్తున్నాయి. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయం వేస్తోందని కాలనీ వాసులు అంటున్నారు. ఎన్ని సార్లు అధికారులకు విన్నవించుకున్నా రోడ్డు వేస్తామని అంటున్నారు తప్ప వేయడం లేదని వాపోతున్నారు.
ఏలేశ్వరం మండలంలోని రమణయ్యపేట-జె.అన్నవరం మధ్య ఆర్‌ అండ్‌ బి రహదారి శిధిలా వ్యవస్థకు చేరుకోవడంతో ఈ రోడ్డుపై ఎలా ప్రయాణించాని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ రహదారి గుండా ఏజెన్సీ రాజవొమ్మంగి అడ్డతీగల వై.రామవరం మండలాల నుండి ప్రజలు వైజాగ్‌ కాకినాడ హైదరాబాద్‌ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాలన్న ఈ రహదారిపై ప్రయాణించవలసిందే. ఈ రహదారిపై ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరిగి వాహనాలు పాడవడంతోపాటు అనేకమంది కాళ్లు చేతులు విరగగొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. లక్ష్మీపురం, జె.అన్నవరం, మర్రివీడు గ్రామాల ప్రజలు అనునిత్యం ఇదే రహదారిపై ప్రయాణించాల్సి వస్తోంది. ప్రజా సంఘాలు రహదారిపై వరి నాట్లు వేసి వినూత్న రీతిలో నిరసన తెలపడంతో పాటు రహదారిపై అడ్డంగా గోడ కడతామని బహిరంగంగా హెచ్చరించారు.