Jul 07,2023 23:44

దుగ్గిరాల-ఈమని రహదారి దుస్థితి

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. వర్షాలతో రోడ్లు పరిస్థితి మరీ అస్తవ్యస్తంగా మారుతోంది. ప్రధానంగా డెల్టా ప్రాంతంలోని పలు మార్గాల్లో ప్రయాణానికి వాహనదారులు నరక యాతన అనుభవిస్తున్నారు. గుంటూరు-పేరేచర్ల వయా పెదపలకలూరు రోడ్డు పరిస్థితి ఇప్పటికీ మెరుగుపడలేదు. దుగ్గిరాల -ఈమని మధ్య రహదారి బాగా దెబ్బతింది. రహదారిపై ప్రయాణం చాలా కష్టంగా ఉందని వాహనదారులు అంటున్నారు. ఈ గుంతలు రోడ్డుపై ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతోందని వాహనదారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కొల్లిపర -తెనాలి మార్గంలో భారీ గోతులు ఏర్పడ్డాయి. శిరిపురం మార్గంలో రోడ్డులో భారీ గుంతలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. శిరిపురం నుంచి తెనాలి వరకు 10 కిలో మీటర్ల మేరకు రహదారి సరిగా లేకవాహనదారులు యాతన పడుతున్నారు. గుంటూరు-విజయవాడ రహదారిపై గుంతలు ఏర్పడినా కనీసం పూడ్చడం లేదు. గుంటూరు-పొన్నూరు రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
గుంటూరులోని ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినా అధికారులు దృష్టిసారించడం లేదు. వ్యాపార కూడలి పట్నం బజారులో చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి కాలుతీసి కాలు వేయలేని స్థితినెలకొంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇదేపరిస్థితి ఉంది. గుంటూరు-నందివెలుగు రోడ్డు, గుంటూరు-చేబ్ల్రోలు, పొన్నూరు, రేపల్లే మార్గంలో గోతులున్నా తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారు. ఆటోనగర్‌ నుంచి నల్లపాడు-చిలకలూరిపేట జాతీయ రహదారికి అనుసంధానం చేసే (మహాత్మాగాంధీ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు) నాలుగు లైన్ల రహదారి మూడో దశ పనులు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. గుంటూరు అడవి తక్కెళ్లపాడు నుంచి పలకలూరు వరకూ చేపట్టాల్సిన పనులపై పదేళ్లుగా సిఆర్‌డిఎ అధికారులు అదిగో...ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. పలుమార్లు అంచనాలు రూపొందించినా ఇప్పటి వరకూ చేపట్టలేదు.
జిల్లాలో పెరిగిన ట్రాఫిక్‌ దృష్ట్యా ప్రధాన రహదారుల విస్తరణ పనులు కూడా ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. గత నాలుగేళ్లలో జిల్లాలో కొన్ని రోడ్లు మాత్రమే మరమ్మతులు చేయగా ఇంకా దాదాపు 100కి పైగా రోడ్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. తాత్కాలిక మరమ్మతులు చేసినా వర్షాకాలం వచ్చేసరికి రోడ్లు గుంతలు, గోతులతో వాహనాలు వెళ్లేందుకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతోంది. సింగిల్‌ రోడ్డును డబల్‌ రోడ్డుగా, డబల్‌ రోడ్డును 10 మీటర్ల రోడ్డుగా, ప్రధాన రహదారులను రెండు వరసల రహదారిగా విస్తరించాలని గతంలో చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. జిల్లాలో దాదాపు 500 కిలో మీటర్ల కురహదారుల విస్తరణకు ప్రతిపాదనలు చేయగా ఇందుకు సంబంధించి నిధులు రాలేదని అధికార వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సవరంలో పూర్తి చేసిన పనులకు సంబంధించి దాదాపు రూ.50 కోట్ల వరకు బిల్లులు రాకపోవడంతో కొత్తపనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని తెలిసింది.