Mar 05,2023 00:25
గుంతలమయంగా ఉన్న రహదారి

ప్రజాశక్తి-సంతమాగులూరు: మండలంలోని బండివారిపాలెం గ్రామం నుంచి లక్ష్మీపురం గ్రామం వరకు ఎనిమిది కిలోమీటర్లు నిడివి ఉన్న ఆర్‌అండ్‌బి రహదారి శిథిలావస్థకు చేరింది. అస్తవ్యస్తంగా తయారై అడుగడుగునా గుంతలమయంగా మారింది. ఈ రహదారి అద్దంకి నుంచి బల్లికురవ మీదుగా కొప్పరం, బండివారిపాలెం, మిన్నేకల్లు గ్రామాన్ని కలుపుతూ లక్ష్మీపురం వద్ద గుంటూరు, కర్నూలు రహదారిలో కలుస్తుంది. ఈ రహదారి గుండా బల్లికురవ, కొప్పరపాలెం, కొప్పరం, బండివారిపాలెం ప్రాంతాల వారు సంతమాగులూరు వైపు వెళ్లకుండా, మిన్నేకల్లు మీదుగా నరసరావుపేట, చిలకలూరిపేట, కోటప్పకొండ వైపు నిత్యం బేల్దారి పనులకు కార్మికులు మోటార్‌ సైకిళ్లు, ఆటోల ద్వారా వెళుతుంటారు. రాత్రులందు ఈ రహదారిపై వాహనాలలో ప్రయాణించేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ప్రతిరోజూ గురిజేపల్లి గ్రానైట్‌ క్వారీల నుంచి బల్లికురవ వైపు గ్రానైట్‌ రాళ్లు అధిక లోడులతో ట్రాలీలు తిరుగుతుంటాయి. దీంతో రహదారి ఛిద్రమై అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.