ఖాజీపేట : ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతన్నలు వర్షాలు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ బోర్ల కింద నారుమళ్లు వేయడానికి రైతన్నలు సంసిద్ధమయ్యారు. భూసారం కోసం కొన్నిచోట్ల జీలగను సాగుచేశారు. మండలంలో వ్యవసాయ బోర్ల కింద ముందస్తుగా వరి నాట్లకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. కెసి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటూరు, కొండపేట ప్రధాన కాలువలకు సంబంధించి ఉపకాల్వలు అధ్వానంగా ఉన్నాయని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపకాలవలు వెంబడి కంప చెట్లు పెరగడంతోపాటు, కాలువ లైనింగ్ పూర్తిగా దెబ్బ తినడంతో పలుచోట్ల సాగునీటికి ఆటంకంగా మారిందని అన్నదాతల ఆవేదన వ్యక్తపరిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్న దష్ట్యా కెసి కాలువలపై పర్యవేక్షణ నుంచి సాగునీటి ప్రవాహాం సాఫీగా సాగేలా కాలువలు వెంబడి ఉన్న కంప చెట్లను తొలగించడంతోపాటు, పిచ్చి మొక్కలు, జమ్ము తొలగించి ప్రవాహానికి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుచున్నారు. మండల వ్యాప్తంగా కెసి ఆయకట్టు కింద దాదాపు 16 వేల ఎకరాలు వరి పంటను సాగు చేస్తుంటారు. ఇప్పటికైనా సాగునీటి పారుదల అధికారులు స్పందించి సమస్య లేకుండా చూడాలని రైతన్నలు కోరుచున్నారు.










