Sep 28,2023 22:40

వాహనదారుల అవస్థలు
ప్రజాశక్తి - ఉండి

           అది పేరుకే జాతీయ రహదారి కాని అభివృద్ధి లేకుండా సుమారు రెండు కిలోమీటర్ల మేర గుంతలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు బోల్తా పడుతున్నాయి. మచిలీపట్నం నుంచి నారాయణపురం చేపల లోడుతో వెళ్తున్న కృష్ణాజిల్లా మూలలంక చెల్లింకుల బసవన్నకు చెందిన ట్రక్‌ ఆటో జాతీయ రహదారి 165పై ఉన్న ఉండి గ్రామంలో బోల్తా పడింది. ట్రక్‌ ఆటో కాబట్టి డ్రైవర్‌ మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ్డాడని, అదే ప్యాసింజర్‌ ఆటో అయితే ఎంతమంది గాయాలపాలయ్యే వారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉండిలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పలువురు కలెక్టర్‌ పి.ప్రశాంతి దృష్టికి అధ్వాన స్థితిలో ఉన్న జాతీయ రహదారి విషయాన్ని తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్‌ పి.ప్రశాంతి జాతీయ రహదారి మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు కలెక్టర్‌ ఆదేశాలను సైతం బేఖాతరు చేశారని పలువురు విస్మయానికి గురయ్యారు. నిత్యం వేలాది మంది ప్రయాణించే రహదారి గుంతలమయం కావడంతో వాహనదారులు పడిపోయి గాయాలపాలవుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇటీవల కాలంలో ఎంఎల్‌ఎ మంతెన రామరాజు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నాగరాజు ఆధ్వర్యంలో టిడిపి, జనసేన నాయకులు శ్రమదానం చేసి రోడ్డు కొంతభాగం బాగు చేసినప్పటికీ మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు రోడ్డు యధాస్థానానికి చేరిందని, పూర్తిస్థాయిలో రోడ్డును బాగు చేయిస్తే ప్రయాణికులు, వాహనదారులు, స్థానికులు సుఖవంతంగా ప్రయాణిస్తారని కోరుతున్నారు. ఇప్పటికైనా జాతీయ రహదారి అధికారులు దీనిపై స్పందించి రహదారిని బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.