ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
పోలవరం నిర్వాసితులను తరలించిన జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పోలవరం మండలాల్లోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థ, ఉపాధి లేక, భూమికి భూమి ఇవ్వక అక్కడికి చేరిన నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆయా ప్రాంతాలకు చెందిన జెడ్‌పిటిసి సభ్యులు, ఎంపిపిలు ఉమ్మడి జిల్లాపరిషత్ సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశపు హాలులో శనివారం జరిగిన జెడ్‌పి సర్వసభ్య సమావేశం జెడ్‌పి చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పోలవరం మండలానికి చెందిన జెడ్‌పిటిసి, ఎంపిపి, వేలేరుపాడు మండలానికి చెందిన ఎంపిపి, జెడ్‌పిటిసిలు పోలవరం నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులు, ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లోని సమస్యలపై గళమెత్తారు. పోలవరం మండలానికి చెందిన శివగిరి, కొరుటూరు నిర్వాసితులను తరలించిన కాలనీలో కనీస వసతులు లేవన్నారు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చేరిన నిర్వాసితుల సమస్యలపై జిల్లాకలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. మండలకేంద్ర పోలవరంలో నిర్మిస్తున్న ఆసుపత్రి పూర్తికాలేదన్నారు. పోలవరం నియోజకవర్గంలో ఇళ్లనిర్మాణాలకు అవకాశం లేకుండా చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వేలేరుపాడులో ఉన్న ఆసుపత్రిలో సరైన ఆసుపత్రిలేక గర్బిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇటీవల ఓ గర్భిణి ఉదయం నుంచి రాత్రి వరకూ నొప్పులతో బాధపడుతూనే ఉందన్నారు. ఆసుపత్రిలో సదుపాయాలు కల్పించాలని కోరారు. ఏజెన్సీలో రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రోడ్లు వేయాలన్నారు. దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించిన పరిహారం ఇవ్వకపోవడం తీవ్ర సమస్యగా ఉందన్నారు. అధికారులు జెడ్‌పిటిసి సభ్యులను కనీసం పట్టించుకోవడం లేదని తెలిపారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానం ఇస్తూ ఐటిడిఎ పిఒ బాధ్యతలు తీసుకున్నారని, కొద్దిరోజుల్లో నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. లేవనెత్తిన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. నాడు - నేడు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సంబంధించిన బకాయిలు, ఇళ్ల నిర్మాణాల పెండింగ్ బకాయిలు, జలకళ, రోడ్లు, ఇరిగేషన్, వ్యవసాయం, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పలు సమస్యలను సభ్యులు లేవనెత్తారు.
పనుల్లో జెడ్‌పిటిసి సభ్యులకు ప్రాధాన్యత : జెడ్‌పి చైర్‌పర్సన్
జిల్లా పరిషత్ నిధులతో మండల పరిధిలో చేపట్టే పనుల్లో జెడ్‌పిటిసి సభ్యుల సూచనలకు ప్రాధాన్యతిస్తామని జెడ్‌పి చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని జెడ్‌పిటిసి సభ్యులు తమ పరిధిలోని గ్రామాల్లో సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా, వాటికి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారుల ద్వారా చర్యలు తీసుకున్నారు. పద్మశ్రీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంతో జిల్లా పరిషత్ ద్వారా వివిధ అభివద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రతీ ఇంటికి జల జీవన్ మిషన్ ద్వారా తాగునీటి కుళాయి కనెక్షన్లు అందిస్తున్నామన్నారు. సత్యసాయి తాగునీటి పధకం ద్వారా జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లోని 151 గ్రామాల ప్రజలకు తాగునీరు అందించామన్నారు. నవరత్నాల్లో భాగంగా గృహ నిర్మాణ పథకాన్ని పూర్తిగా అమలు చేసి రాష్ట్రంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని గ్రామాల్లో పూర్తి పారిశుధ్య పరిస్థితులు ఉండేలా చూడాలని, దోమల నిర్మలన చర్యలు చేపట్టాలన్నారు. వరదల కారణంగా పాడైన రోడ్లకు మరమత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతిచ్చి అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందని, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాధరాజు మాట్లాడుతూ ఇటీవల వరద ముంపునకు గురైన ప్రాంతాల్లోని ప్రజలకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని, వరద బాధితులకు అండగా నిలిచి, వారికి అసౌకర్యం కలగకుండా వరద సహాయక చర్యలు చేశారన్నారు. జిల్లా పరిషత్ ద్వారా నిధుల కేటాయింపును అన్ని మండలాలకు సమానంగా కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. పోలవరం నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్‌కాలనీల్లో పారిశుధ్యం, తాగునీరు వంటివి వాటికి జెడ్‌పి నిధులు కేటాయించాలన్నారు. శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఎంపిటిసిలకు గౌరవ వేతనం పెంచాలని కోరారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో పిహెచ్‌సి ఏర్పాటు చేయాలని కోరారు. తణుకు, పెరవలి మండలాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ సబ్ స్టేషన్‌లు నిర్మించాలని కోరారు. పెరవలి మండలం మల్లేశ్వరంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు దాతలు స్థలం అందించారని, ఆ ప్రదేశంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ నంబూరి తేజ్ భరత్, ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు, జిల్లా పరిషత్ సిఇఒ కె.రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాధ్ శ్రీనివాస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కొల్లేరులో లైడార్ విధానంలో భూసర్వే
కొల్లేరు కాంటూరు పరిధిలో లైడార్ విధానం ద్వారా భూముల రీ సర్వే చేస్తున్నట్లు ఏలూరు జిల్లాకలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంలో చేపట్టిన నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బందాలు పనుల నాణ్యతను పరిశీలిస్తాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీల్లో విద్య, వైద్యానికి సంబంధించిన సదుపాయాలతోపాటు, మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పిస్తామన్నారు.
పంచాయతీరాజ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
ఇళ్ల వెంకటేశ్వరరావు, ఎంఎల్‌సి
పంచాయతీ రాజ్‌లో సుమారు 470 మంది అటెండర్లు, స్వీపర్లు, ట్యాంక్ వాచ్‌మెన్, తదితర ఉద్యోగులకు 2010 నుండి పిఆర్‌సిలు వర్తింప చేయలేదని, 20 నెలల డిఎ ఇవ్వలేదన్నారు. ఆ బకాయిలు చెల్లించాలని కోరారు. హైస్కూళ్లలో ఏర్పాటు చేసిన ప్లస్2 విద్యకు సంబంధించి బోధనా సిబ్బందిని నియమించినట్లు వివరాలిచ్చారని, విద్యార్థుల సంఖ్య మాత్రం తక్కువగా ఉందన్నారు. ప్లస్ టు విద్య బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు.