ప్రజాశక్తి - హాలహార్వి
రహదారులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పట్టుకొమ్మలని అంటారు. అలాంటి రహదారులు మండలంలో పూర్తిగా పాడైపోయాయి. అడుగేస్తే మడుగు అనే అంతలా పరిస్థితి ఉంది. అక్కడ రోడ్డు ఉందా అనిపించే దారులు మండలంలో లెక్కలేనన్నీ ఉన్నాయి. రోడ్డు నిర్మాణం, మరమ్మతులపై పాలకులు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. ఒకవైపు కంకర తేలిన రోడ్లు, మరోవైపు గుంతలమయమైన రోడ్లు, ఇంకోవైపు బురద రోడ్లు... మండలంలో ఏ దారిలో వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రహదారులు ప్రమాదకరంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు మరింత అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లపై ప్రయాణం ఇబ్బందిగా మారింది. రోడ్లపై నుంచి ప్రజా ప్రతినిధులు, అధికారులు వెళ్తున్నా వాటి మరమ్మతుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హాలహర్వి మండలంలోని గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారాయి. గుంతలు పడి, కంకర రాళ్లు తేలి ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రహదారుల విషయంపై అధికారులకు, నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదని చింతకుంట, శిరుగాపురం, నిట్రవట్టి, ఆలూరు, గూళ్యం, సిద్ధాపురం, చింతకుంట, కొక్కరచేడు గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ఈ రోడ్లు భారీగా దెబ్బతిని ఉండడంతో ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు పడి, కంకర తేలి ఇబ్బందిగా ఉందని అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. రాత్రి వేళ వాహనాలపై వెళ్లాలంటే భయమేస్తోందని వాహనదారులు చెబుతున్నారు. ఎన్నోసార్లు కింద పడి గాయాలయ్యాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు స్పందన కార్యక్రమాల్లో ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చామని, రోడ్ల గురించి ఇప్పటి వరకు స్పందన లేదని వాహనదారులు పేర్కొంటున్నారు. పాఠశాలలకు, కళాశాలలకు గ్రామీణ విద్యార్థులు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దారుల్లో కొంతదూరం వెళితే ఒళ్లు గుల్ల అవుతోంది. ఏ కాస్త ఆదమరచిన గోతుల్లో పడి కాళ్లు, చేతులు విరుగుతున్నాయి. ఇక గర్భిణులు ఆస్పత్రులకు వెళ్లాలంటే ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయపడాల్సి వస్తోంది. అధికారులు, నాయకులు స్పందించి గ్రామీణ రహదారులను బాగు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు
మండలంలో గ్రామీణ రోడ్లు అద్వానంగా ఉన్నా, పాలకులు, అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల సమయంలో నాయకులు ఓట్ల కోసం ఈ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీలు గుప్పించినా, ఎన్నికల అనంతరం పట్టించుకోవడం లేదు. గ్రామీణ రోడ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా మారింది. ప్రతేడాది వర్షాకాలంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గత సంవత్సర కాలంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఈదారి గుండా ప్రయాణించినా ఈ రోడ్లకు మోక్షం కలగడం లేదు.
దెబ్బతిన్న రోడ్లు










