Feb 20,2023 00:12

అధ్వాన రహదారిని చూపుతున్న గిరిజన సంఘ నేత రామారావు

అనునిత్యం అవస్థలు పడుతున్న ప్రజలు
ఎన్నిసార్టు మొరపెట్టుకున్నా పట్టని అధికారులు
ప్రజాశక్తి- రాజవొమ్మంగి
: మండలంలోని లబ్బర్తి నుంచి డి.భీమవరం మీదుగా అడ్డతీగల వెళ్లే తారురోడ్డు అధ్వానంగా ఉండడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజవొమ్మంగి, లబ్బర్తి, అనంతగిరి, డి.భీమవరం మీదుగా అడ్డతీగల వెళ్లే సుమారు 25 కిలోమీటర్లు రహదారిలో రాజవొమ్మంగి, దూసరపాము, నెల్లిమెట్ల, లబ్బర్తి, ముంజవరపాడు, అనంతగిరి, భూసులపాలెం, చీడిపాలెం, గడువకుర్తి, డి భీమవరం తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది అనునిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. దాదాపు పదేళ్ల క్రితం గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ రోడ్డును తర్వాత కనీస నిర్వహణ లేకపోవడంతో ఇపుడు గోతులమయమై, అనేక చోట్ల రోడ్డుపై ఉన్న తారు చెదిరిపోయి, రాళ్లు తేలి ప్రయాణసంకటంగా మారిందని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. అడ్డతీగల ప్రాంతానికి వెళ్లాలంటే ఇదే దగ్గర మార్గం కావడంతో అటుగా వెళ్లేవారు ఎక్కువగా ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా రూపుకోల్పోయిన ఈ మార్గంలో వెళ్లాలంటే ప్రాణాలను అరచేతితో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. అంతేకాక అనారోగ్య పరిస్థితులు, ఇతరత్రా అత్యవసర పరిస్థితుల్లో గమ్యం చేరేందుకు నానా అగచాట్లు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. అధ్వానరోడ్డులో ప్రయాణం వల్ల వాహనాలు పదేపదే మరమ్మతుకు గురౌతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో లబ్బర్తి, అడ్డతీగల రహదారి దుస్థితిపై అధికారులు దృష్టి పెట్టి బాగు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
తక్షణం మరమ్మతులు చేపట్టాలి : గిరిజన సంఘం
లబ్బర్తి, అనంతగిరి, డి భీమవరం మీదుగా అడ్డతీగల వెళ్లే రహదారి నిండా పెద్ద గోతులమయమై, రాళ్లు తేలి ఉండడంతో వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు డిమాండ్‌ చేశారు. ఆదివారం రహదారి దుస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏళ్ల తరబడి కనీస నిర్వహణ లేక రోడ్డు అధ్వానస్థితికి చేరుకున్నా అధికారులు, నేతలకు పట్టకపోవడం దారుణమన్నారు. దీనిపై పలుమార్లు విన్నవించినా ఎటువంటి చలనం లేకపోవడం విచారకరమని, ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఏదైనా ప్రమాదం జరగకముందే అధ్వాన రహదారికి తక్షణ మరమ్మతులు చేపట్టడంతోపాటు తర్వాత శాశ్వత ప్రాతిపదికన పునర్మిర్మాణం చేసి పటిష్టపరచాలని కోరారు. లేకుంటే ఈ ప్రాంత ప్రజలను సమీకరించి ఆందోళన చేయక తప్పదని హెచ్చరించారు.