Feb 25,2023 21:40

ఏ ఒక్క పనికీ కానరాని ప్రభుత్వ అనుమతులు
ఊసే లేని టెండర్ల ప్రక్రియ
రూ.900 కోట్లు విలువైన పనులున్నా నిధులు సున్నా
డెల్టా ఆధునికీకరణపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం
ప్రతియేటా రైతుల కష్టాలు వర్ణనాతీతం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

డెల్టా ఆధునికీకరణ పనులు ఈ ఏడాది లేనట్టేనని తేలిపోయింది. ఏప్రిల్‌ నెలాఖరుకు కాలువ కట్టేసి పనులు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఏఒక్క పనికీ అనుమతి రాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులకు సిద్ధం కావాల్సిన యంత్రాగం ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో టెండర్ల ఊసే లేకుండాపోయింది. వైసిపి ప్రభుత్వం అధికారంలొకొచ్చాక డెల్టా ఆధునికీకరణను పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో ఖరీఫ్‌లో వరద నీరు కిందకు పారక, రబీలో సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల డెల్టా ప్రాంతంలో దాదాపు 4.60 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు. 11 ప్రధాన కాలువలు, 300కు పైగా ఉప కాలువల ద్వారా డెల్టాకు సాగునీరు సరఫరా సాగుతోంది. 2007లో డెల్టా ఆధునికీకరణ పనులకు సంబంధించి 1464.44 కోట్లకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దశాబ్దన్నర కాలం గడిచినా ఆధునికీకరణ పనులు పూర్తి కాలేదు. ఇంకా రూ.900కోట్లకు పైగా విలువ చేసే ఆధునికీరణ పనులు జరగాల్సి ఉంది. గత ప్రభుత్వాల హాయాంలో ప్రతియేటా ఎంతోకొంత పనులు జరిగేవి. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆధునికీకరణ పనులు పడకేశాయి. కాలువలపై బ్రిటీష్‌ కాలం నాటి కట్టడాలతోనే ఇప్పటికీ నెట్టుకొస్తున్నారు. కెనాల్‌ లైనింగ్‌, స్ట్రక్చర్‌ రిపేరింగ్‌ వంటి పనులు ఎప్పటి నుంచో పెండింగ్‌లోనే ఉన్నాయి. పూడికతో నిండిన కాలువలను పూర్తిస్థాయిలో తవ్వాల్సి ఉంది. గడిచిన మూడున్నరేళ్లలో ఏఒక్క పనీ జరగని దుస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతియేటా అన్నదాతకు కష్టాలే
డెల్టా ఆధునికీకరణ పనులు జరగకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కాలువలు పూడికతో నిండటంతో చిన్నపాటి వర్షానికే పొలాల్లో నీరు నిలిచిపోతుంది. ఖరీఫ్‌లో నారుమడుల దశలోనే రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. వరదల సమయంలో ఇక పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కాలువలు పూడిపోవడంతో నీరు కిందకు పారక పొలాల్లో రోజులు తరబడి వరద నీరు నిల్వ ఉండిపోతుంది. దీంతో పంటంతా కుళ్లిపోయి దెబ్బతింటుంది. ప్రతియేటా పంటలు దెబ్బతినడం ప్రభుత్వం అరకొరగా నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం సర్వసాధారణమైంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కౌలురైతులే 75 శాతం సాగు చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పరిహారం సైతం కౌలురైతులకు అందడం లేదు. ఆధునికీకరణ పనులు జరిగి ఉంటే పొలాల్లో నీరు త్వరితగతిన తగ్గి పంట దెబ్బతినే పరిస్థితి ఉండదు. ప్రతియేటా లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింటున్నా ప్రభుత్వానికి మాత్రం ఆధునికీకరణ గురించి పట్టడం లేదు. ఇక రబీ సాగుకు వచ్చేసరికి సాగునీరు అందక రైతుల పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ప్రస్తుత రబీలో కొనసాగుతున్న పరిస్థితే అందుకు నిదర్శనం. గోదావరి జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో సీలేరు జలాలపైనే రబీ సాగు నడుస్తోంది. కాలువ పరిధిలో ఆయకట్టుకు ఐదు రోజుల చొప్పున వంతులవారీ విధానం అమలవుతోంది. కాలువలు మెరకదేరిపోవడంతో నీరు కిందకు పారక వంతులవారీ విధానంలో పొలాలకు సాగునీరు అందడం లేదు. దీంతో రైతులు ఆయిల్‌ ఇంజిన్లతో పంటను కాపాడుకోవాల్సి దుస్థితి నెలకొంది. దీనంతటికీ ప్రధాన కారణం ఆధునికీకరణ పనులు జరగకపోవడమే. తమ్మిలేరుకు సంబంధించి ఆధునికీకరణ పనులు చేసిన కాంట్రాక్టర్‌కు చెల్లింపులు చేయకపోవడంతో చిన్నచిన్న పనులు చేసేందుకు సైతం కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఆధునికీకరణ పనులపై ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.