డెల్టా ఆధునికీకరణపై కొనసాగుతున్న నిర్లక్ష్యం
ఇప్పటికీ వేసవిలో చేపట్టబోయే పనులపై స్పష్టత కరువు
వైసిపి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా అటకెక్కిన పనులు
ఎక్కడకక్కడ పంట కాలువల్లో పూడిక
ప్రతియేటా వేలాది ఎకరాలు ముంపుబారిన
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
పంట కాలువల ఆధునికీకరణపై ఈ ఏడాదీ సందిగ్ధ పరిస్థితి కన్పిస్తోంది. రాబోయే వేసవిలో డెల్టా ఆధునికీకరణకు సంబంధించి చేపట్టబోయే పనులకు సంబంధించి, టెండర్ల ప్రక్రియకు సంబంధించిన స్పష్టత లేదు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఈ ఏడాదీ డెల్టా ఆధునికీకరణ పనులపై ప్రభుత్వం చేతులెత్తేసినట్లేనా అనే చర్చ రైతుల్లో నెలకొంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డెల్టా పరిధిలో 5.29 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు. ఈ సాగు మొత్తానికి గోదావరి నుంచి పంట కాలువల ద్వారా వచ్చే సాగునీరే ఆధారం. 11 ప్రధాన కాలువలు, 300కుపైగా పిల్ల కాలువల ద్వారా సాగునీటి సరఫరా జరుగుతోంది. ఏడాదికి దాదాపు 20 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతోంది. ఇంత పెద్దఎత్తున పంట పండించేందుకు ఆధారమైన కాలువల ఆధునికీకరణను వైసిపి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. తూడు, గుర్రపుడెక్క వంటివి తీయడం తప్ప ముఖ్యమైన కాలువల్లో మెరకతీసే పనులు మాత్రం నామమాత్రంగా మారాయి. 2007లో అప్పటి ప్రభుత్వం డెల్టా ఆధునికీకరణ పనుల నిమిత్తం రూ.1464.44 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకూ దాదాపు రూ.800 కోట్లు విలువ చేసే పనులు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంకా రూ.600 కోట్ల విలువ చేసే ఆధునికీకరణ పనులు జరగాల్సి ఉంది. 2019లో అప్పుడే వైసిపి ప్రభుత్వం ఏర్పడటంతో ఆధునికీకరణ పనుల ఊసే ప్రస్తావన లేకుండాపోయింది. 2020లో రూ.250 కోట్ల విలువైన పనులకు సంబంధించి జిల్లా ఇరిగేషన్ అధికారులు నివేదికలు తయారు చేసి ప్రభుత్వ అనుమతి కోసం పంపగా స్పందన లేదు. దీంతో పనులు జరగని పరిస్థితి ఏర్పడింది. 2021లో రూ.300 కోట్ల పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపగా అనుమతి రాలేదు. దీంతో మూడేళ్లు ఆధునికీకరణ పనులు అనేవి ముందుకు సాగిన దాఖలాల్లేవు. జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశాల్లో మంత్రులు మాట్లాడుతూ జనవరి నెలఖారులకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కాలువలు మూసివేసిన వెంటనే పనులు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చేస్తుంటారు. అయితే క్షేత్రస్థాయిలో పనులు మాత్రం జరిగిన పరిస్థితి లేదు. ఈ ఏడాదిసైతం ఆధునికీకరణ పనులు జరుగుతాయా.. లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండటంతో ఆ సంవత్సరంలో ఆధునికీకరణ పనులు జరగడం కష్టమే.
ప్రతియేటా వేలాది ఎకరాలు మునక
డెల్టా ఆధునికీకరణ జరగకపోవడంతో ప్రతియేటా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. చిన్నపాటి వర్షం వస్తే చాలు నారుమడులు, నాట్లు ముంపుబారిన పడుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. రబీలో ప్రతియేటా నీటిఎద్దడి సమస్యతో సతమతమవుతున్నారు. ఖరీఫ్‌లో భారీ వర్షాలు కురిసినప్పుడు పొలాల్లో నీరు కిందకు పారక పంటలు దెబ్బతింటున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఆధునికీకరణ గురించి మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ఏడాదైనా ప్రభుత్వం ఆధునికీకరణ పనులపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.










