May 06,2023 00:27

ఆధునికీకరించిన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-సీతమ్మధార : ఆధునికీకరించిన సీతమ్మధార అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అధిక సేవలందించేది రెవెన్యూ శాఖ అని, సిబ్బంది కష్టపడి పనిచేసి ప్రజలకు చేరువ కావాలని సూచించారు. విశాఖపట్నం ఆర్డీవో కార్యాలయానికి స్థలం గుర్తించాలని ఆర్డీవోను కోరారు. జిల్లాలో నాలుగు హాస్టళ్లను ఆధునికీకరించినట్లు చెప్పారు. సుమారు రూ.8 కోట్లతో కెజిహెచ్‌ను కార్పొరేట్‌ స్థాయిలో ఆధునికీకరించినట్లు వెల్లడించారు. అటెండెంట్లు ఉండే గదులను కూడా ఆధునికీకరించినట్లు తెలిపారు. కొత్తగా నిర్మించబోయే ములగాడ, గోపాలపట్నం, మహారాణిపేట తహసీల్దార్‌ కార్యాలయాలు ఆర్చి, భవనం ముఖచిత్రం, డిజైన్‌ చేయాలన్నారు. సీతమ్మధార తహశీల్దార్‌ కార్యాలయాన్ని ఆధునికీకరించిన తహశీల్దార్‌ పి.శ్యాంప్రసాద్‌ను కలెక్టర్‌ అభినందించారు.
జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌.విశ్వనాథన్‌ మాట్లాడుతూ, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్ననాడే సిబ్బంది విధులుపై మరింత దృష్టి సారిస్తారన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, మండల కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు వల్ల సమస్యలతో వచ్చే ప్రజలకు సహకారం అందించినట్లు అవుతుందని, ప్రజలకు మరింత చేరువ కావచ్చని పేర్కొన్నారు. రీ సర్వే, స్పందనపై దృష్టి సారించాలన్నారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ ద్వారా వివిధ సేవలు అందించినందుకు ఈ నెల 8వ తేదీన రాష్ట్ర గవర్నర్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ అవార్డు అందుకోబోతున్నట్లు వివరించారు. విశాఖపట్నం ఆర్డీఓ హుస్సేన్‌ సాహెబ్‌ మాట్లాడుతూ, పనిచేసే చోట ఆహ్లాదకరంగా ఉన్ననాడే ప్రజలకు మరిన్ని సేవలందించేందుకు దోహదపడుతుందన్నారు.
అనంతరం భీమిలి, మహారాణిపేట, ములగాడ, గాజువాక, గోపాలపట్నం, పెందుర్తి, పెదగంట్యాడ, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం రూరల్‌, విశాఖపట్నం అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయాల ఆధునికీకరణకు రూ.ఐదేసి లక్షలు చొప్పున తహశీల్దార్లకు కలెక్టర్‌ అందజేశారు. భీమిలి ఆర్‌డిఒ కార్యాలయానికి రూ.25 లక్షల చెక్కును భాస్కర్‌రెడ్డికి అందజేశారు. అనంతరం విశాఖపట్నం అర్బన్‌ తహసీల్దార్‌ పి.శ్యాంప్రసాద్‌ను సన్మానించారు. భీమిలి ఆర్డీవో భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు త్రినాథ్‌, ఉప కలెక్టర్లు ఎస్‌డి.అనిత, రామలక్ష్మి, సత్య పద్మ, డి.ప్రమీలగాంధీ, కలెక్టరేట్‌ ఏవో కె.ఈశ్వరరావు, తహశీల్దార్లు కె.వేణుగోపాల్‌, ఆనందరావు, వీరభద్రరావు, పాల్‌ కిరణ్‌, కె.జయ, ఆనంద్‌కుమార్‌, రమాదేవి, ఉప తహశీల్దార్లు ఎం.చేతన్‌కుమార్‌, చైతన్య, రాజేష్‌, రవికృష్ణ, తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.