ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా విచిత్రమైన, విషాదకరమైన ప్రహసనం సాగుతోంది. 'ఆనందయ్య ఇస్తున్న మందు కరోనాను నయం చేస్తుందన్న దాఖలాలు ఏమీ లేవు' అని ప్రభుత్వ ఆయుష్ విభాగం ప్రకటించింది. ప్రస్తుతం కంట్లో చుక్కల మందును ఉపయోగించవద్దని కూడా తెలిపింది. నిజానికి ఆనందయ్యకు విశేష ప్రచారం లభించింది ఈ కంట్లో వేసే చుక్కల మందు తోనే కదా. ''ఇలా కంట్లో చుక్కలు వేశారో లేదో, అలా పేషెంటు దిగ్గున లేచి కూచున్నాడు'' అన్న ప్రచారం, వీడియోలు తెగ వైరల్ అవబట్టే కదా వేల సంఖ్యలో ప్రజలు కృష్ణపట్నంలో పోగై లాఠీ దెబ్బలు తిన్నారు ? ఇప్పుడు ఆ చుక్కల మందు వలన కంటిచూపు దెబ్బ తింటుందా, లేక ఇంకా ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అన్నది పరీక్షించే పనిలో ఆయుష్ విభాగం ఉంది.
ఆనందయ్య పంపిణీ చేసే పసరు మందు, గుళికలు మహా అయితే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచగలవేమో తప్ప కరోనాను నయం చేయవు అని చెప్పాక, వాస్తవం బైటపడ్డాక ఇంక ఆ నాటు మందు కోసం జనం వెంపర్లాడరు అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. ఇప్పుడే అసలు డ్రామా మొదలైంది.
ప్రధాన పత్రికలన్నీ 'ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి' అన్న విషయాన్ని హైలైట్ చేశాయే తప్ప ఆ మందు కరోనాను నయం చేయదు అన్న అతి ముఖ్యమైన వాస్తవాన్ని, ప్రజలకు ప్రధానంగా తెలియజేయవలసిన వాస్తవాన్ని హైలైట్ చేయలేదు. చుక్కల మందుకు కూడా ఇవాళో, రేపో అనుమతి వచ్చేస్తుంది అన్న భావం స్ఫురించే విధంగా కూడా కొన్ని పత్రికలు రాశాయి. ఆనందయ్య విజయం సాధించినట్టు, ఇక యథావిధిగా మందును పంపిణీ చేయడమే తరవాయి అన్నట్టు రాశాయి.
ఇక ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి బృందం ఆనందయ్యను వెంటబెట్టుకుని అతగాడిని అభినందించడం (పని చేయని మందు తయారు చేసినందుకా?) రాబోయే కాలంలో మరెన్నో మందులను ఆనందయ్య కనిపెట్టనున్నాడంటూ ఊదరగొట్టడం చేశారు. త్వరలో ఆ మందును పంపిణీ చేయడానికి, అందునా భారీగా తయారుచేసి మరీ పంపిణీ చేయడానికి సిద్ధం అవుతున్నామంటూ ప్రకటించారు. కృష్ణపట్నంలో కరోనా ఎంతమందికి సోకిందో తెలుసుకోవడానికి వైద్య సిబ్బంది పరీక్షలు జరిపేందుకు అక్కడికి పోతే చాలామంది ముందుకు రాలేదు. అందరూ పరీక్షలు చేయించుకోవాలని చెప్పవలసిన బాధ్యత ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఆ ప్రస్తావనే చేయలేదు. అంటే పని చెయ్యని నాటుమందుకు వత్తాసు పలుకుతూ స్వయానా ఒక ఎమ్మెల్యే ప్రజల ఆరోగ్యాలతో, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడన్న మాట! కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కూడా కృష్ణపట్నం వచ్చి ఆనందయ్యను అభినందించారని వార్తలు వచ్చాయి. అంటే ఆయుష్ విభాగం వచ్చిన నిర్ధారణ గురించి వారికేమీ పట్టలేదన్నమాట.
ఇక ప్రతిపక్షనేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఈ పనిచేయని మందు ఘనత అంతా ఎక్కడ వైఎస్‌ఆర్‌సిపి స్వంతం చేసుకుంటుందో అన్న బాధతో కాబోలు, అసలు ఆనందయ్య మందుకు అనుమతులు ఇప్పించడం వెనుక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి గారి పాత్ర కీలకం అంటూ ప్రకటించారు. చివరికి మన దేశ ఉపరాష్ట్రపతి పదవి ఒక నాటువైద్యుడికి కొమ్ము కాసే స్థితికి దిగజారింది.
జిల్లా కలెక్టరు ''చాలా విస్తృతంగా'' ఆనందయ్యతోను, అధికార పార్టీ నేతలతోను ఆనందయ్య నాటుమందు పంపిణీ గురించి చర్చలు జరిపి చివరకు ఆ మందు సక్రమంగా పంపిణీ అయ్యేలా చూసే బాధ్యత ప్రభుత్వానిదే అని ప్రకటించారు ! ఇది మరీ దారుణం! ఒక నాటుమందు పని చేయదని చెప్పిన ప్రభుత్వమే ఆ మందు పంపిణీకి బాధ్యత వహిస్తుందని చెప్పడాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి? జిల్లాలో కరోనా నియంత్రణ గురించి ఇదే విధంగా శ్రద్ధ తీసుకుని వుంటే, ఆనందయ్య మందు విషయమై పనిగట్టుకుని సోషల్ మీడియా, ఇతర ప్రధాన మీడియా ప్రచారం చేసినప్పుడే- అంటే మే నెల మొదటి వారంలోనే జిల్లా కలెక్టరు గారు తగిన దృష్టి పెట్టి నియంత్రించి వుంటే ఇంత గందరగోళం జరిగివుండేదా? అధికార పార్టీ ప్రతినిధుల ఒత్తిడులకు లోనై ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి సాగుతున్న రాజకీయ జూదంలో జిల్లా అధికారులు కూడా భాగస్వాములు కావడం అన్యాయం.
ఆనందయ్య మందు కరోనాను నయం చేయదని తేల్చిన తర్వాత కూడా స్వయంగా కలిసి ఆనందయ్యను అభినందించిన రాజకీయ నేతలలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కూడా ఉన్నారు. ఆనందయ్య మందు పని చేయకపోయినా హాని ఏమీ చేయదు కదా అని పరోక్షంగా దానిని సమర్ధిస్తున్నవారు కూడా ఉన్నారు.
మొత్తంగానే ఆనందయ్య నాటుమందు ఉదంతం ఆ నాటు వైద్యానికి, ఆధునిక అల్లోపతి వైద్యానికి మధ్య ఒక పోటీ పెట్టే వాదనలను ముందుకు తెచ్చింది. అంతకన్నా ముఖ్యంగా ఆనందయ్య నాటుమందు ఉపయోగాన్ని ప్రశ్నించిన వారంతా కార్పొరేట్ ఆస్పత్రుల విచ్చలవిడి దోపిడీని సమర్ధించే బ్రోకర్లని అంటూ ఒక నిందాపూర్వక ప్రచారం కూడా జరిగింది. కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీకి ఆనందయ్య మందు దీటైన సమాధానం అన్నట్టు ప్రచారం సాగింది. కొంతమంది ఆయుర్వేద వైద్యంలో డిగ్రీ పొందిన వారు సైతం ఈ ప్రచారంలో భాగస్వాములయ్యారు. ఒకపక్క ఆయుష్ విభాగం ఆనందయ్య మందు వలన కరోనా నయం కాదని ప్రకటించినా, ఆ మందుకు అల్లోపతి వైద్యానికి పోటీ పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కోట్లాది ప్రజల ప్రాణాలతో తాము చెలగాటమాడుతున్నారని విస్మరిస్తున్నారు.
ఇటువంటి ప్రచారమే దేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ రూపాలలో సాగుతోంది. బాబా రాందేవ్ ఇటీవల అల్లోపతి వైద్యం పనికిమాలినదని వ్యాఖ్యానించి స్వపక్షం వారిచేత సైతం చీవాట్లు తిన్నాడు. అయినా వెనక్కి తగ్గకుండా తననెవరూ ఏమీ చేయలేరంటూ విర్రవీగుతూ ప్రకటలనలిస్తున్నాడు. అతనికి హర్యానా, యు.పి వంటి బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు మద్దతు పలుకుతున్నాయి. కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ఒక నెల రోజుల క్రితం ఈ కరోనా ఉధృతి సమయంలో గోమూత్రం మీద, ఆవు పేడ మీద పరిశోధనలకు రూ.100 కోట్లు కేటాయించి అవి ఏవిధంగా కరోనాను నియంత్రించగలవో త్వరగా తేల్చి చెప్పమన్నాడు. ఇక కుంభమేళా లో గంగా స్నానం వలన కరోనా సోకదన్న ప్రచారం, గంగ నీటి ఔషధ గుణాల ప్రాశస్త్యం గురించి ప్రచారం విరివిగానే సాగింది. ఇప్పుడు ఆనందయ్య మందు కూడా ఈ జాబితాలో చేరింది.
నిజానికి కరోనా జాతికి చెందిన ఒక తరహా వైరస్ వల్లనే కోవిడ్-19 మహమ్మారి సోకుతోందని కనిపెట్టినది ఏ వైద్య విధానంలో ? ఆధునిక వైద్య విధానంలో కాదా ? రికార్డు సమయంలో ఆ వైరస్ ను వేరు చేసి, దాని జన్యుపటాన్ని ఆవిష్కరించినది ఏ విధానంలో ? అది కూడా ఆధునిక వైద్యవిధానమే కదా ! ఆ వ్యాధి ఏవిధంగా విస్తరిస్తోందో, అది సోకినదీ లేనిదీ ఏ విధంగా నిర్ధారించాలో ఆ పరీక్షలను ఆధునిక వైద్య విధానమే కదా ఆవిష్కరించింది? కరోనా నుండి మనలను రక్షించుకునే వ్యాక్సిన్ లను తయారు చేయడం పై ఏడాదిన్నర కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 రకాల వ్యాక్సిన్‌లను కనిపెట్టి ఉత్పత్తి స్థాయికి తెచ్చినది ఆధునిక వైద్య విధానమే కదా ?
ప్రజలను తప్పుదోవ పట్టించి కొల్లగొట్టేది కార్పొరేట్ ఆస్పత్రుల నిర్వాహకులు. అంతే కాని ఆధునిక అల్లోపతి వైద్య విధానం కాదు. ఏ శాస్త్ర పరిశోధనా చేయకుండానే ఓ రాందేవ్ బాబా గాని, ఓ ఆనందయ్య గాని మాత్రమే ప్రకటించి తమ అవగాహనా రాహిత్యాన్ని బాహాటంగా ప్రకటించుకోగలరు! అందుకు భిన్నంగా తమ పరిమితులేమిటో స్పష్టంగా తెలుసును గనుకనే ఆయుష్ విభాగం అనవసర వివాదాలలోకి పోకుండా తమ పరిధిలో ప్రజలకు ఏవిధంగా ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడగలవో ఆమేరకు కృషి చేస్తున్నాయి.
కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీ, అమానవీయంగా వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వాలు దానిని నియంత్రించడంలో విఫలం కావడం - ఇదంతా వాస్తవం. ఐతే పనిచెయ్యని ఒక నాటు మందు కార్పొరేట్ దోపిడీకి సరైన పరిష్కారం అవుతుందా? కరోనా నుండి రక్షణ ఆశించే ప్రజలను ఈ తరహా వాదన మరింత ప్రమాదంలోకి నెట్టడం లేదా? కరోనా ముప్పు నుండి ప్రజలను ప్రపంచవ్యాప్తంగా కాపాడడంలో కీలక భూమిక పోషిస్తున్న అల్లోపతి విధానం మీద ఈ దాడి ఎందుకు జరుగుతోంది?
కరోనా మహమ్మారి రెండో విడత వస్తోందని తెలిసికూడా కావాలనే దానిని నిర్లక్ష్యం చేసి కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెట్టడంలోను, తమ రాజకీయ అధికారాన్ని ఎలాగైనా విస్తరింపజేసుకునే ప్రయత్నాలలోను మునిగిపోయింది బిజెపి. ఈ నిర్లక్ష్యం దేశ ప్రజలకు ప్రాణాంతకం అయింది. ప్రపంచం మొత్తానికే అవసరమైన వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఉండిన మన దేశం ఈనాడు తన స్వంత ప్రజలలో కనీసం పది శాతానికి కూడా వ్యాక్సిన్ అందించలేకపోయింది. చివరకు ఆక్సిజన్ కూడా కరువైంది. ఇదంతా మోడీ ప్రభుత్వ వైఫల్యమేనని ప్రపంచం అంతా దుమ్మెత్తి పోస్తోంది. ఈ ఇరకాటం నుండి బైటపడడానికి సంఘపరివారం ప్రతివ్యూహం పన్నింది. దోషమంతా జాగ్రత్తలు పాటించని ప్రజలదేనని, కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని, ఇలా నిరాధారంగా ఎదురుదాడి చేసి తప్పించుకోజూస్తున్నది. మొదటి విడత కరోనా వచ్చినప్పుడు ఇదంతా చైనా కుట్ర అని, తబ్లిగి జమాత్ వల్లనే వ్యాపించింది అని చెప్పి అప్పటి నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే తప్పుడు ప్రచారానికి పాల్పడిన మోడీ పరివారం ఇప్పుడు అదే ప్రచార వ్యూహంతో వ్యవహరిస్తోంది. కాకపోతే కేంద్రం వైఫల్యం ఈసారి మరీ కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ ల కొరత విషయంలో సుప్రీం కోర్టు కూడా మోడీ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. వ్యాక్సిన్ బాధ్యత కేంద్రానిదేనని తేల్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా అల్లోపతి వైద్యమే విఫలం అయిందన్న ప్రచారం చేస్తే ఇక వ్యాక్సిన్ ల గురించి చర్చ పక్కకు పోతుంది కదా.
మన రాష్ట్రమే చూడండి. కరోనా ఉధృతి ఏమాత్రమూ తగ్గడం లేదు. ప్రభుత్వం తగిన శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అందరూ ఆనందయ్య నాటుమందు వెంటపడితే ఆ మేరకు ప్రభుత్వానికి ఒత్తిడి తగ్గినట్టేనని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు ఉంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే (కేరళ, జార్ఖండ్ మాదిరిగా) తన వైఫల్యం కూడా చర్చకు వస్తుందన్న భయంతోనే జగన్ ప్రభుత్వం కేంద్రంపై పల్లెత్తు మాట అనడం లేదు.
అందుచేత ఇప్పుడు ఆనందయ్య నాటు మందు గురించి జరుగుతున్న చర్చ లక్ష్యం ప్రజల ఆరోగ్య సంరక్షణ కాదు. మోడీ ప్రభుత్వ ఘోర వైఫల్యం నుండి ప్రజల దృష్టిని అనవసర వివాదాల వైపు మళ్ళించడమే అసలు లక్ష్యం. తెలిసో తెలియకో అనేకులు ఈ విషయంలో పరోక్షంగా మోడీకి, కొంతమేరకు జగన్ కు తోడ్పడుతున్నారు. అలా తోడ్పడడంలో ప్రతిపక్షం కూడా ఉండడం వింతగా ఉంది కదా.
ఒకవైపు ఆనందయ్య మందును సమర్ధిస్తూ కార్పొరేట్ దోపిడీ గురించి కొందరు మాట్లాడుతున్నారు. కాని ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ నిర్వహిస్తున్న పాత్రను, ప్రాణాలకు సైతం తెగించి ప్రజల ఆరోగ్య రక్షణకోసం కోవిడ్ పై పోరాడుతున్న వైద్యులను, ఇతర పారా మెడికల్ సిబ్బంది సేవలను, వారి ప్రాణ త్యాగాలను విస్మరిస్తున్నారు. ఎంత లోపభూయిష్టంగా ఉన్నా, గత మూడు దశాబ్దాల కాలంలో ఎంత నిర్లక్ష్యానికి గురైనా, ఇప్పటికీ అత్యధిక ప్రజానీకాన్ని కరోనా బారినుండి కాపాడుతున్నది ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ మాత్రమే. దానితో పోల్చితే కార్పొరేట్ వైద్య వ్యవస్థ ఏపాటిది? ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సిబ్బంది కృషిని నాటుమందు సమర్ధకుల వాదనలు చిన్నచూపు చూస్తున్నాయి.
ఈ రెండో విడత కరోనా ఉధృతి సమయంలోనే ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలను బలిచేసిన అల్లోపతి వైద్యులు (దాదాపు అందరూ ప్రభుత్వ ఆస్పత్రులలో పని చేసేవారే) దేశంలో దాదాపు 600 మంది ఉన్నారు. మన రాష్ట్రంలో సుమారు ముప్ఫౖౖె మంది! వారి బలిదానం పట్ల కూడా ఇసుమంతైనా గౌరవం చూపకుండా ప్రభుత్వ వైద్య వ్యవస్థ పాత్రను చిన్న చూపు చూసి, అల్లోపతి వైద్యం అంటే కార్పొరేట్ వైద్యమే అన్నట్టు వాదించడం దుర్మార్గం కాదా? నా విధానాలను వ్యతిరేకించేవారంతా దేశభక్తి లేనివారు, దేశద్రోహులు, విదేశీ ఏజంట్లు అనే మోడీ పరివారం వాదనల వంటిది కాదా ఈ వాదన? ఆనందయ్య మందు పని చేస్తుందో లేదో తేల్చమంటే అలా అడిగేవారంతా కార్పొరేట్ ఆస్పత్రుల బ్రోకర్లు అని నిందించడమూ అటువంటి వాదనే. వారంతా ఇప్పుడు ఆనందయ్య మందు పని చెయ్యదన్న ఆయుష్ విభాగాన్ని ఏమంటారు? దానికి దేశం మొత్తం మీద సారథి మోడీ గారే కద! అసలు వాస్తవానికి కార్పొరేట్ వైద్య వ్యవస్థ దోపిడీకి కొమ్ములు తెచ్చిందెవరు? వ్యాక్సిన్ లను రాష్ట్ర ప్రభుత్వాలకు గాకుండా కార్పొరేట్ ఆస్పత్రులకు అమ్ముకోడానికి అనుమతులిచ్చింది మోడీ కాదా? ఆయన కన్నా పెద్ద కార్పొరేట్ సేవకులు ఎవరు? కరోనా సమయంలో కూడా ప్రజలపై భారం పెంచేవిధంగా పెట్రో ధరలను పెంచారే కాని కార్పొరేట్లకు సంపద దోచిపెట్టడం ఒక్కరోజైనా ఆపారా?
ప్రధాన సమస్యల నుండి ప్రజల దృష్టిని పక్కకు మళ్ళించి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూనే తిరిగి ఎదుటివారిని దోషులుగా నిలబెట్టడమే ఆర్‌ఎస్‌ఎస్, సంఘపరివారం నీతి. కేంద్రం వ్యాక్సిన్ విధానం ఘోరంగా విఫలమైనప్పటికీ, రాష్ట్రాలనే దోషులుగా నిందిస్తున్నప్పటికీ, కేంద్రంపై నోరు విప్పకపోవడమే గాక, ఆనందయ్య నాటుమందు ఉదంతంలో సంఘపరివారం వ్యూహానికి తెలిసో తెలియకో తోడ్పడుతున్నది రాష్ట్రంలోని అధికార పార్టీ. దానికేమీ తీసిపోకుండా వ్యవహరించే తాపత్రయంలో ఉంది ప్రధాన ప్రతిపక్షం. ఈ రెండు పార్టీలనూ వాడుకునే పనిలో ఉంది రాష్ట్ర బిజెపి. జూలై-ఆగస్టులో మూడో విడత కోవిడ్ ఉధృతి తాకనుందని హెచ్చరికలు వస్తున్నాయి. ఈ విడత చిన్న పిల్లలకు సైతం ముప్పు ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. కనీసం మన పిల్లలను కాపాడుకోవడం కోసమైనా కాస్త ఇంగితాన్ని, ఇంకాస్త మానవత్వాన్ని, శాస్త్ర విజ్ఞానం పట్ల కాస్తంత గౌరవాన్ని, అన్నింటికీ మించి ప్రజల ప్రాణాల పట్ల కనీస బాధ్యతను ప్రదర్శించాలని ఈ పెద్దలందరి నుంచీ ఆశించవచ్చా?
- ఎం.వి.ఎస్.శర్మ










