ఆధునిక టెక్నాలజీతో పారిశుద్ధ్య నిర్వహణ
టీటీడీ జెఈవో సదా భార్గవి
ప్రజాశక్తి - తిరుమల
ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారని, ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత మెరుగ్గా పారిశుద్ధ్య చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని టీటీడీ జెఈవో సదా భార్గవి తెలిపారు. తిరుపతిలోని శ్వేత భవనంలో సోమవారం శుద్ధ తిరుమల - సుందర తిరుమల కార్యక్రమంపై ఒకరోజు వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం తిరుమలలో నిరంతరాయంగా శుద్ధ తిరుమల - సుందర తిరుమల కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. తిరుమలతోపాటు తిరుపతిలోని టీటీడీ సంస్థల వద్ద మరింత మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వహణ ఎలా చేపట్టాలనే విషయంపై నిపుణుల సూచనలు స్వీకరించేందుకు ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి నిపుణులను ఆహ్వానించినట్టు చెప్పారు. టీటీడీ ఆరోగ్య విభాగం అధికారులు, సిబ్బంది ఈ వర్క్‌షాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జొన్నలగడ్డ రామమూర్తి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సలహాదారు డా. జయప్రకాష్ సాయి, గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్ అదనపు మున్సిపల్ కమిషనర్ డా. వి.సన్యాసిరావు, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన జెఎస్‌ఆర్.అన్నమయ్య, సింగపూర్‌లోని ప్లానెట్‌వైజ్ సంస్థ వ్యవస్థాపకులు కె.అనిల్‌కుమార్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ పి.రవి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్వేత భవనంలో మెరుగ్గా పారిశుద్ధ్య విధులు నిర్వహించిన 12 మంది కార్మికులను జెఈవో సన్మానించి బహుమతులు అందజేశారు. అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్‌ఇ-2 జగదీశ్వర్‌రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, శ్వేత డైరెక్టర్ ప్రశాంతి, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్‌కుమార్ పాల్గొన్నారు.










