ఆధునిక సోషలిస్టు చైనా నిర్మాణమే లక్ష్యంగా చైనా కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ సమావేశాలు ఇటీవల ప్రకటించిన ప్రణాళికలు ఆ దేశ ప్రజలకే కాదు, యావత్ ప్రపంచానికే దిక్సూచిగా నిలిచాయి. ప్రపంచ పెట్టుబడిడారీ దేశాలు కరోనా మహమ్మారి, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఎలా బయటపడాలో తెలియని దుస్థితిలో ఉండగా, చైనా ఈ సంక్షోభాన్ని అవలీలగా అధిగమించి అందరినీ అబ్బుర పరచింది. నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అది చోదక శక్తిగా నిలిచింది.
భారత్‌తో సహా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు నెగిటివ్ గ్రోత్ (ప్రతికూల వృద్ధి రేటు)తో నేల చూపులు చూస్తుండగా చైనా దీనికి భిన్నంగా 3.2 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతోంది. అమెరికా ప్రారంభించిన రెండో ప్రచ్ఛన్న యుద్ధం అనేక ఆటంకాలు కలిగిస్తున్నా, వాటన్నిటిని అధిగమించి పురోగమన పథంలో సాగడం ఈ కాలంలో చైనా సాధించిన గొప్ప విజయం. మానవాభివృద్ధి సూచిలో ర్యాంక్‌ను మెరుగు పరచుకోవడం, పేదరికాన్ని నిర్మూలించాలన్న 2030 నాటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని పదేళ్లకు ముందుగానే సాధించడం మానవాళి అభ్యున్నతి పట్ల చైనా కమ్యూనిస్టు పార్టీ నిబద్ధతకు నిదర్శనం. 1950లలో ప్రారంభించిన పంచవర్ష ప్రణాళికలను క్రమం తప్పకుండా అమలు చేయడం ద్వారా ఇతర దేశాలకు చైనా ఒక నమూనాగా నిలిచింది. మిగతా దేశాల్లో ఈ ప్రణాళికలు చాలా వరకు కాగితాలకే పరిమితమవుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే వరకు చైనా ప్రభుత్వం విశ్రమించబోదని ఫిన్లాండ్ ఆర్థికవేత్త చెప్పడం చైనా విశిష్టతకు తార్కాణం. ప్రాంతీయ, ఆర్థిక అసమానతలు రూపుమాపడం, పేదరిక నిర్మూలన, ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల ఆధునీకరణలో చైనా ప్రణాళికా వ్యవస్థ అనిర్వచనీయమైన కృషి సాగిస్తున్నది. దాని ఫలితంగానే ప్రపంచ జనాభాలో 22 శాతం కలిగి ఉండి, ప్రపంచ సాగుభూమిలో 6 శాతం మాత్రమే కలిగి ఉన్న జన చైనా వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించగలుగుతోంది. ప్రజలందరికీ ఆహార భద్రత చేకూర్చగలిగింది. ఈ డెబ్బయ్యేళ్లలో 85 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసింది. మన దేశంలో నీతి ఆయోగ్ ప్రభుత్వ రంగ సంస్థలను టోకుగా ప్రైవేట్ కంపెనీలకు అమ్మడం ఎలా? నయా ఉదారవాద విధానాలను రాష్ట్రాల నెత్తిన రుద్దడం ఎలా అన్నదాని గురించి ఆలోచిస్తోంది. సోషలిస్టు దేశాల్లో ప్రభుత్వాలు అనుసరించే విధానాలకు, పెట్టుబడిదారీ దేశాల్లోని పాలకవర్గ పార్టీలు అనుసరించే విధానాలకు తేడా ఇటువంటి సందర్భాల్లోనే కొట్టొచ్చినట్టు కనబడుతుంది.
కరోనా వైరస్‌ను అరికట్టడంలో చైనా అమోఘమైన కృషి చేసింది. అద్భుతమైన ప్లానింగ్, సమన్వయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వైరస్‌ను ఉహాన్ నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కట్టడి చేసింది. మన దేశం కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా కలిగిన అమెరికా సరసన నిలిచింది. ఆర్థిక వ్యవస్థ పీకల్లోతు సంక్షోభంలో చిక్కుకుంది. గత అయిదేళ్లుగా దిగజారుతూ వస్తున్న ఆర్థిక వృద్ధి రేటు 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మైనస్ 9.5 శాతానికి పడిపోవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఈ అనర్థాలన్నిటికి మూలమైన నయా ఉదారవాద విధానాలను వెనక్కి తీసుకోవడం వివేకవంతమైన ఏ ప్రభుత్వమైనా చేయాల్సిన పని. కానీ, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఈ ముదనష్టపు విధానాలనే మరింత దూకుడుగా అమలు చేస్తోంది. చైనాలో అమలు జరుగుతున్న సంస్కరణలు, భారత్‌లో సంస్కరణలు ఒక్కటే అని నమ్మబలికే నయా ఉదారవాద విధాన సమర్థకులు భారత ఆర్థిక వ్యవస్థ ఇంత దీనంగా ఎందుకు ఉందో చెప్పగలరా? మొన్న ప్లీనరీ సమావేశాల్లో జిన్‌పింగ్ ఆధునిక సోషలిస్టు చైనా నిర్మాణం మార్క్సిస్టు రాజకీయ అర్థశాస్త్రం పునాదులపైనే జరుగుతుంది తప్ప నయా ఉదారవాద విధానాలపై కాదని తేల్చి చెప్పారు. చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్థ నిర్మాణానికి మావో దగ్గర నుంచి డెంగ్ సియావోపింగ్, జియాంగ్ జెమిన్, హూ జింటావో, నేటి సీ జిన్‌పింగ్ వరకు కృషి చేస్తూ వస్తున్నారు. చైనాలోని ద్రవ్య సంస్థలు పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీ కిందే ఉండేలా చూడడం ద్వారా డాలర్ పెత్తనానికి ఎలాంటి ఆస్కారం లేకుండా చేశారు. అమెరికా ఆధిపత్యవాదం, కరోనా విసురుతున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని చారిత్రికంగా అనుసరిస్తూ వస్తున్న ఎగుమతుల ఆధారిత ఆర్థిక వ్యవస్థతో బాటు దేశీయ మార్కెట్ వ్యవస్థకు గిరాకీ పెంచాలని చైనా కమ్యూనిస్టు పార్టీ సంకల్పించింది. దీంతోబాటు దీర్ఘకాలిక లక్షమైన ఆధునిక సోషలిస్టు చైనా నిర్మాణానికి కృతనిశ్చయంతో ముందుకు సాగాలని నిర్ణయించుకోవడం నేటి పరిస్థితుల్లో అత్యంతావశ్యకం.










