Sep 11,2023 23:57

ప్రజాశక్తి - చీరాల 
ఆధునిక భారత దేశంలో సనాతన ధర్మానికి చోటే లేదని ప్రజా వేదిక రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి ఏసురత్నం అన్నారు. స్థానిక అంబెడ్కర్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో 'సనాతన ధర్మం నేడు అవసరమా' అనే అంశంపై జరిగిన చర్చ వేదికలో ఆయన మాట్లాడారు. ప్రజా సంఘాలు, అంబేద్కర్ వాదులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళు ఎందరో మేధావులు సమాజంలో జరుగుతున్న అకృత్యాలపై పోరాటాలు చేసి చట్టాల రూపంలో సమానత్వాన్ని సాధించుకుంటే నేడు కొందరు మూర్కులు కలసి దేశాన్ని అందయుగానికి తీసుకెళుతున్నారని అన్నారు. సామాజిక రుగ్మతలతో ప్రజల మధ్య అగాధం సృష్టించే సనాతన ధర్మం నేటి ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. మణిపూర్ ఘటనలో మహిళలను వివస్త్రాలను చేస్తే మాట్లాడని మేధావులు ప్రశ్నించిన గొంతుకను తీసుకొస్తే రూ.10కోట్లు ఇస్తామని ప్రకటించడం హేయమైన చర్యని అన్నారు. కార్యక్రమంలో దళిత మహాసభ నాయకులు నూకతోటి బాబురావు, కెవిపిఎస్ అధ్యక్షులు లింగం జయరాజు, సిపిఎం నాయకులు నలతోటి బాబురావు, ఎస్‌జె చిరంజీవి, దుడ్డు విజయసుందర్, ఎన్‌ మోహన్ కుమార్ ధర్మ, డిహెచ్‌పిఎస్ నాయకులు జోసెఫ్, గుమ్మడి ఏసోబు పాల్గొన్నారు.