
ప్రజాశక్తి- రాజాం: కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కార గ్రహీత బేతవోలు రామబ్రహ్మ రచించిన శమంతకమణి ప్రబంధం అధునాతన భావాలతో కూడినదని ప్రముఖ సాహితీవేత్త ఒమ్మి రమణ మూర్తి చెప్పారు. ఆదివారం స్థానిక విద్యానికేతన్ పాఠశాలలో జరిగిన రాజాం రచయితల వేదిక 105వ సమావేశంలో ఆయన 'శమంతకమణి-బేతవోలు పద్యబాణి' అనే అంశంపై ప్రసంగించారు. భాగవతంలోని కొద్ది పద్యాల శమంతకమణి కథను అధునాతన భావాలతో, ఔచిత్యవంతమైన మార్పులతో, చక్కటి ప్రబంధంగా రాశారని ఆయన అన్నారు. ప్రబంధం కవుల పద్ధతిలో రాసినా, చాలాచోట్ల ఆధునిక భావాలను జొప్పించారని చెప్పారు. 18 ఏళ్ళు నిండిన బాలికకు పెళ్లి చేయడం, సముద్రుడికి అణుజలాంతర్గామి కొడుకుగా పుట్టడం వంటి ఎన్నో ఆధునికమైన, అభ్యుదయ భావాలను ఈ గ్రంథంలో చూడవచ్చని అన్నారు. ఏకాక్షర కందం వంటి పద్యాలను రాసి తన పాండితీ ప్రతిభను కనబరిచారని చెప్పారు. పద్యకవికి ప్రబంధ రచన కష్టమనుకుంటే, వీరు ఈ పనిని సునాయాసంగా చేశారని చెప్పారు. పిల్లా తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వేదిక నిర్వాహకుడు గార రంగనాథం, పెంకి దయానిధి నాయుడు, రౌతు గణపతిరావు నాయుడు, తురంగి విశ్వనాథం, బొంతు సూర్యనారాయణ, అంబళ్ళ రామ్మూర్తి, కుదమ తిరుమలరావు, పడాల కవీశ్వరావు, పెంకి చైతన్యకుమార్, వల్లూరు రామినాయుడు, వేగిరెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.