పెట్టుబడిదారీ ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా తన గుత్తాధిపత్యాన్ని సవాలు చేసే దేశాలను బెదిరిస్తుంది. సార్వభౌమత్వం కలిగిన ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది. తన సైనిక, ఆర్థిక బలాన్ని ఉపయోగించి ప్రభుత్వాలను అస్థిరపరచేందుకు కుతంత్రాలు పన్నుతుంది. లాటిన్ అమెరికాలో పలు చోట్ల వామపక్ష, ప్రగతిశీల ప్రభుత్వాలు ఏర్పడడం, చైనా ప్రధాన అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తుండడాన్ని అమెరికా సహించలేకపోతున్నది.
అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారులు తరచూ భారత్‌లో పర్యటిస్తున్నారు. వారి పర్యటనల వెనుక అసలు ఆంతర్యమేమిటో మనం మెరుగ్గా అర్థం చేసుకోవాలంటే అమెరికా ప్రభుత్వ పత్రాలను, ముఖ్యంగా జాతీయ భద్రతా వ్యూహం (2017), 'ఇండో-పసిఫిక్ వ్యూహం (2019)', చైనా పట్ల అమెరికా వ్యూహాత్మక వైఖరి (ఆగస్టు 2020) వంటివి అధ్యయనం చేయాల్సిన అవసరముంది. దానికి ముందుగా, సోవియట్ యూనియన్ పతనానంతరం అమెరికా చూపిస్తున్న ప్రపంచ వ్యవస్థ ఎలా వుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది.
సోవియట్ యూనియన్ కుప్పకూలిన తరువాత 'రక్షణ ప్రణాళికా నిర్దేశం' (1992) పేరుతో అమెరికా ఒక వ్యూహాత్మక పత్రాన్ని తీసుకొచ్చింది. సోవియట్ యూనియన్ పతనానంతరం అమెరికా పోషించాల్సిన పాత్రను ఆ డాక్యుమెంట్ నిర్వచించింది. 'పూర్వపు సోవియట్ యూనియన్ భూభాగంలో లేదా మరెక్కడైనా కొత్త ప్రత్యర్ధి తిరిగి ఆవిర్భవించకుండా చూడడం, గతంలో సోవియట్ యూనియన్ వల్ల ఎదురైన ముప్పే ఇప్పుడు మళ్లీ ఎదురు కాకుండా చూడడం మన మొదటి లక్ష్యం. కొత్త ప్రాంతీయ రక్షణ వ్యూహంలో ఇది అంతర్లీనంగా ఉండాలి. ప్రపంచ శక్తిగా ఎదగడానికి సరిపడా వనరులు, సంఘటిత నియంత్రణ కలిగిన ప్రాంతం ఆధిపత్యం చెలాయించే అవకాశం వున్నందున, ఆ పరిస్థితి రాకుండా మనం చూడాలి. అటువంటి ప్రాంతాల్లో పశ్చిమ యూరప్, తూర్పు ఆసియా, పూర్వపు సోవియట్ యూనియన్ భూభాగం, నైరుతి ఆసియా వున్నాయి.' అని తెలిపింది.
పెట్టుబడిదారీ ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా తన గుత్తాధిపత్యాన్ని సవాలు చేసే దేశాలను బెదిరిస్తుంది. సార్వభౌమత్వం కలిగిన ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది. తన సైనిక, ఆర్థిక బలాన్ని ఉపయోగించి ప్రభుత్వాలను అస్థిరపరచేందుకు కుతంత్రాలు పన్నుతుంది. లాటిన్ అమెరికాలో పలు చోట్ల వామపక్ష, ప్రగతిశీల ప్రభుత్వాలు ఏర్పడడం, చైనా ప్రధాన అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తుండడాన్ని అమెరికా సహించలేకపోతున్నది. ఈ రెండు పరిణామాలు వివిధ ప్రాంతీయ సహకార కూటముల ఏర్పాటుకు దారి తీశాయి. దాంతో, ఎప్పటికీ కొనసాగాలని అమెరికా కోరుకుంటున్న ఏక ధ్రువ ప్రపంచం ఇంకెంతో కాలం కొనసాగే స్థితి లేదు. బహుళ ధ్రువ ప్రపంచం వైపు దారితీస్తున్న ఈ పరిణామాలు సామ్రాజ్యవాద అమెరికాకు గుబులు పుట్టిస్తున్నాయి.
లాటిన్ అమెరికా విసిరిన సవాలును ఎదుర్కోడానికి అక్కడి వామపక్ష, ప్రగతిశీల ప్రభుత్వాలను అస్థిరపరిచేలా ఆయా దేశాల్లోని పాలక వర్గాలను ప్రేరేపించింది. కొంతమేరకు విజయం సాధించింది కూడా. బ్రెజిల్‌లో రాజ్యాంగపరమైన కుట్ర, బొలీవియాలో సైనిక కుట్ర, అర్జెంటీనా, ఈక్వెడార్‌లో గత ప్రభుత్వాలు అనుసరించిన ప్రజానుకూల విధానాలను తిప్పికొట్టడానికి జోక్యం చేసుకున్న తీరు ఆ ప్రాంతంపై దానికున్న పట్టును తెలియజేస్తుంది. అయితే, వీటికి ప్రజా ఉద్యమాల రూపంలో ప్రతిఘటన కూడా ఎదురవుతోంది.
రెండవది, అత్యంత కీలకమైన అంశమేమిటంటే చైనా ప్రధాన ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం. ఇందుకు ప్రధాన కారణం చైనాను ఎప్పుడూ కూడా ఒక భిన్నమైన వ్యవస్థగానే అమెరికా పరిగణిస్తూ వస్తోంది. అందుకు ఒకటి, కమ్యూనిస్టు పార్టీ పాలనలో చైనా వుండడం. సోషలిస్టు పంథాలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న పార్టీ సంకల్పం. ఈ రెండు కారణాల రీత్యా చైనాను అమెరికా పక్కన పెడుతూ వస్తున్నది. అమెరికా అనుసరిస్తూ వచ్చిన పెట్టుబడిదారీ పంథాకు పూర్తి భిన్నమైన పంథాను చైనా అనుసరిస్తోంది. సోవియట్ యూనియన్ కుప్పకూలడంతో సోషలిస్టు, కమ్యూనిస్టు సిద్ధాంతం ఓడిపోయిందని అమెరికా రెచ్చిపోయి చేస్తున్న ప్రకటనలు పూర్తిగా బూటకమని వేగంగా ఎదుగుతున్న చైనా నిరూపిస్తున్నది. చైనాను ప్రత్యర్థి శక్తి ఆవిర్భావంగానే కాకుండా సైద్ధాంతిక శత్రువుగా కూడా అమెరికా పరిగణిస్తూ వచ్చింది.
1960వ దశకంలో చైనాతో దౌత్య సంబంధాలను నెలకొల్పుతున్నపుడు కూడా అమెరికా తన ఉద్దేశాలను ఎన్నడూ దాచుకోలేదు. చైనాతో సంబంధాలను తిరిగి నెలకొల్పిన అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ అలా చేయడానికి కారణాలను స్పష్టంగా వెల్లడించారు. ''దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే, దేశాల కూటమి లేదా కుటుంబం నుండి ఎన్నటికీ చైనాను దూరంగా పెట్టలేం. చైనా మారేవరకు ప్రపంచం సురక్షితం కాబోదు. అందుకనే, మేం చేయగలిగినంతవరకు, సంఘటనలను ప్రభావితం చేసి, మార్పును తీసుకురావాలన్నదే మా లక్ష్యం''. చైనాతో సంబంధాలను నెలకొల్పుకోవడం, డబ్ల్యుటిఓలో సభ్యురాలిగా చేర్చుకోవడం వెనక గల ప్రధాన ఉద్దేశం చైనాలో మార్పు వచ్చేలా ప్రేరేపించడానికేనని నిక్సన్ చెప్పారు.
చైనాలో ఎటువంటి మార్పు, ఎలా రావాలని అమెరికా ఊహిస్తున్నదో చైనాపై వ్యూహాత్మక పత్రం (ఆగస్టు 2020) స్పష్టంగా వివరిస్తున్నది. 'లోతుగా సంబంధాలను పెట్టుకోవడం వల్ల పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పిఆర్‌సి) ప్రాథóమిక, ఆర్థిక, రాజకీయ రంగ అవకాశాలను దెబ్బతీయవచ్చు. పిఆర్‌సి పట్ల అమెరికా విధానం ఈ ప్రాతిపదిక మీదే ఆధారపడి ఉన్నది.' అని ఆ పత్రం తెలిపింది. చైనా కమ్యూనిస్టు పార్టీ సంకల్పాన్ని, బలాన్ని అమెరికా చాలా తక్కువగా అంచనా వేసిందని ఈ నలబై ఏళ్ల అనుభవం రుజువు చేస్తున్నది. చైనా తన ఆర్థిక సంస్కరణల పంథాను కొనసాగించి, మార్కెట్ శక్తులే ప్రధానంగా గల ఆర్థిక, వాణిజ్య వ్యవస్థగా పరివర్తన చెందుతుందని డబ్ల్యుటిఓ సభ్యులు ఆశించారు. కానీ, అలా జరగలేదు.
అంతర్జాతీయ వ్యవస్థతో చైనాను మిళితం చేసి, బహుళజాతి సంస్థలను చొప్పించడం ద్వారా చైనాను అంతర్గతంగా బలహీన పరచవచ్చని, అంతిమంగా అది చైనా విచ్ఛిన్నానికి దారితీస్తుందని అమెరికా ఆశించింది. అయితే తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే బడా పెట్టుబడిదారులకు సాంకేతికత బదిలీ, చైనా చట్టాలకు కట్టుబడి వుండాలనే షరతులను చైనానే విధించిందన్న వాస్తవాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోంది. 1. చైనా సంస్థలకు అమెరికా కంపెనీలు తమ సాంకేతికతలను బదిలీ చేయాలని చైనా ఒత్తిడి తెచ్చింది. 2.మార్కెట్ పరంగా వారి సాంకేతికతకు లైనెన్స్ ఇచ్చే అమెరికా కంపెనీల సామర్ధ్యంపై గణనీయంగా పరిమితులు విధించింది.
చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే యత్నాలను అమెరికా కొనసాగిస్తూనే వుంది. చైనా కమ్యూనిస్టు పార్టీకి, చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అశాంతిని రెచ్చగొడుతున్నది. టిబెట్, జియాన్జింగ్ లో ఇలాగే చేసింది. హాంకాంగ్ లోనూ ఇదే పథకాన్ని అమలుచేస్తున్నది. హాంకాంగ్‌లో 1300కి పైగా అమెరికా వాణిజ్య, వ్యాపార సంస్థలు పని చేస్తున్నాయి. కాబట్టి హాంకాంగ్‌లో అసమ్మతివాదులు తమ నిరసనల్లో అమెరికా పతాకాలను, వారి జాతీయ గీతాన్ని ఉపయోగించడం ఆశ్చర్యమేమీ కలిగించదు. హాంకాంగ్‌లో కార్యాలయాలను కలిగివున్న యు.ఎస్ ఎయిడ్ కి సంబంధించిన అనుబంధ సంస్థలు ఈ నిరసనలకు నిధులను అందచేస్తున్నాయని రుజువైంది. ముఖ్యమైన అంశమేమంటే అమెరికా సెనెట్ ఈ విషయంలో మరీ అత్యుత్సాహం ప్రదర్శించింది. హాంకాంగ్ నిరసనకారులను అమెరికాకు ఆహ్వానించి మరీ వారికి మద్దతు ప్రకటించింది.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన ఆర్థిక ఉనికిని ముఖ్యంగా 'బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్' ద్వారా పెంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తుండడంతో అమెరికా మరింతగా ఆందోళన చెందుతోంది. చైనా ఎదుగుదల తన ప్రపంచ గుత్తాధిపత్యానికి ముప్పుగా అమెరికా భావిస్తున్నది. చైనా అధ్యక్షుడు, చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సీ జిన్‌పింగ్ ఇటీవల చేసిన ప్రకటన అమెరికాను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ''సమగ్ర జాతీయ శక్తిగా, చైనా లక్షణాలతో కూడిన సోషలిజం వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా అంతర్జాతీయంగా ప్రభావాన్ని కలుగజేయాలన్నది చైనా కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం'' అని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ''పెట్టుబడిదారీ వ్యవస్థకు కాలం చెల్లుతుందని, సోషలిజం విజయం సాధిస్తుందని జిన్‌పింగ్ ప్రకటించారు.
చైనాను నిలువరించేందుకు ఉద్దేశించిన అనుబంధ సామర్ధ్యాల అభివృద్ధితో సహా అణు త్రయం ఆధునీకరణకు ప్రాధాన్యతనిస్తోంది. ''ఈ సవాలును మేం (అమెరికా) ఒంటరిగా ఎదుర్కోలేం' అన్న విషయాన్ని గ్రహించిన అమెరికా భావ సారూప్యత కలిగిన దేశాల కొత్త గ్రూపును ఏర్పాటు చేసే సమయం ఆసన్నమైందని ప్రకటించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతానికి ప్రాధాన్యతనివ్వడం, క్వాడ్‌ను రూపొందించడం, భారత్‌తో ''2 ప్లస్ 2 మెకానిజం''ను వ్యవస్థాగతం చేయడం వీటినన్నింటినీ ఈ నేపథ్యంలోనే చూడాల్సి వుంటుంది. చైనా పట్ల అమెరికా విధానం 'కేవలం అదుపు చేయడమే కాదు' అని ఇండో-పసిఫిక్ వ్యూహాత్మక నివేదిక (2019) పేర్కొంటోంది. తన సామ్రాజ్యవాద కార్యకలాపాల కోసం మొత్తంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతాన్ని సైనికీకరణ చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది. దీన్ని ఎంత మాత్రమూ అనుమతించరాదు.
సంకుచితమైన అమెరికా దార్శనికతకు భారత ప్రభుత్వం తలొగ్గింది. అమెరికాతో ప్రమాదకరమైన రీతిలో భాగస్వామ్యాలను కలుపుకుంటోంది. ఇప్పటికే, పోర్ట్‌బ్లెయిర్‌లో అమెరికా నావికా దళానికి చెందిన పి-8 విమానానికి ఇంధనం నింపుకునేందుకు భారత ప్రభుత్వం ఆమోదించింది. భారత్ ఆతిథ్యమిచ్చే హిందూ మహా సముద్ర ప్రాంతంలోని ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్‌లో అమెరికా లైజాన్ అధికారిని ఆమోదించింది. భారత్, అమెరికా మధ్య ఇప్పుడు కుదిరిన బిఇసిఎ ఒప్పందం ఇటువంటి సంబంధాలను మరింత తీవ్రతరం చేస్తుంది. అది భారత ప్రయోజనాలకు తీవ్ర విఘాతం. సోషలిజం, మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతాలకు, భావజాలానికి కట్టుబడి వున్న మనం అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందడానికి, శాంతికి భంగం కలిగించేందుకు, సమస్యలు పెచ్చరిల్లడానికి ఎంత మాత్రమూ అనుమతించరాదు.
(వ్యాసకర్త సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు)
ఆర్. అరుణ్ కుమార్











