దేశం మరోసారి నాలుగు రోడ్ల కూడలిలో నిలబడింది. ఒకవైపున ఆర్థిక సంక్షోభం... ఇంకోవైపున నిరుద్యోగం. మరోవైపున కరోనా మహమ్మారి... వేరొకవైపున సమాజ పురోగమనానికి అవసరమైన స్వేచ్ఛ, లౌకికతత్వాన్ని అణచివేసే నిరంకుశ మతోన్మాద పోకడలు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పరిస్థితులు సత్యానికి సంకెళ్లవుతాయి. ఉన్న స్వేచ్ఛనూ హరించివేస్తాయి. 'రాజకీయ స్వేచ్ఛకు ప్రతిబింబం.. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ' అంటారు గాంధీజీ. అధికారం, స్వేచ్ఛ తిరోగమన దారి పడితే అది వినాశనానికి దారి తీస్తుంది. సమాజం తన లక్ష్యం వైపు పురోగమించాలంటే మొదట స్వేచ్ఛాయుత వాతావరణం వుండాలి. గ్రామాల్లో కుల పెద్దలు, మత పెద్దలు చెప్పింది గౌరవించాలి. లేదంటే... ఊరిలో అంత పెద్దమనిషి చెప్పింది గౌరవించవా, ఆచారాలను, సంస్కృతీ సంప్రదాయాలను పశ్న్రిస్తావా ? అంటారు. లేదంటే... పెద్దల మాటలకు ఎదురు చెప్పకూడదంటూ కాస్త సున్నితంగా చెబుతారు. వీటన్నిటిలో వున్నది ఆధిపత్య ధోరణే. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో ఏకాభిప్రాయం, ఏకగ్రీవాలు అనే చర్చ జరుగుతోంది. దీనిలో ఏకగ్రీవాలనేది చిన్న భాగం మాత్రమే. ఏకాభిప్రాయం మాటున ఆధిపత్యం చలాయిస్తే కుదరదు. దాన్ని ఎదిరించాల్సిందే. అయితే, సంబంధితులందరూ ఉమ్మడిగా మనసు విప్పి మాట్లాడుకొని ఏకాభిప్రాయానికి వచ్చినట్లయితే... అవి సానుకూల ఫలితాలే ఇవ్వొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటివి ఒయాసిస్సులే! పెద్దల అనుభవాన్ని, విజ్ఞానాన్ని స్వీకరించాలి... నిజమే. తరాలు మారుతున్నకొద్దీ జ్ఞానం పెరుగుతూ వుంటుంది. మన పూర్వీకులే కదాని ఆదిమానవుల అనుభవాన్ని, వారి జ్ఞానాన్ని ఇప్పుడు స్వీకరించగలమా? 'యుగయుగానికీ స్వభావం మారుతుంది' అంటాడు తిలక్. అంతేకాదు... 'ఏ దేశ సంస్కతి అయినా ఏనాడు కాదొక స్థిరబిందువు' అనీ అంటాడు. మనసు మనుషుల ఆలోచనలను వికసింపజేయాలంటే... స్వేచ్ఛగా మాట్లాడనివ్వాలి. తప్పు ఒప్పులను వివరించి చెప్పాలి. ఈ పద్ధతి ద్వారానే పిల్లలకైనా, పెద్దలకైనా నేర్పగలుగుతాం. నేర్చుకోవడమనేది ఒక శాస్త్రీయమైన ప్రక్రియ. నిరంతర సాధన. విజ్ఞానానికి, అజ్ఞానానికి మధ్య జరిగే ఘర్షణ లోంచి నేర్చుకోవడమనే ఒక ఫలితం వస్తుంది. విద్యార్థుల జ్ఞానం, ఉపాధ్యాయుల విజ్ఞానం మధ్య ఘర్షణ జరిగితేనే.. ఆ ఫలితం విద్యార్థి బురల్రోకి ఎక్కుతుంది. అంతేగాని, బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చినట్లు జ్ఞానం ఎక్కదు. ఈ సంఘర్షణ జరగాలంటే, తనకు తెలియనిది అడిగే స్వేచ్ఛ విద్యార్థికి వుండాలి. అలాగే గ్రామాల్లోని కుల పంచాయతీలకు, కుల పెద్దలకు, ఇంట్లో కుటుంబ పెద్దలకు ఎదురు చెప్పే స్వేచ్ఛ ఇప్పటికీ లేదు. కుటుంబంలోనే స్వేచ్ఛ లేకపోతే... గ్రామ పెద్దలను ఎదిరించే ధైర్యం, వారి ఆధిపత్యాన్ని ప్రశ్నించే తత్వం ఎక్కడి నుంచి వస్తుంది. ఆధిపత్యాన్ని ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ఎలా? అంబేద్కర్ చెప్పినట్లు.. 'తల ఎత్తు.. ఆందోళన చెయ్యి..' లేదంటే.. 'మేము చెప్పాం కాబట్టి మీరు అంగీకరించాల్సిందే'ననే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటారు.
మోడీ కూడా ఇదే సూత్రాన్ని దేశం మొత్తానికి అన్వయిస్తున్నారు. ఇదోరకమైన నిరంకుశ ధోరణి. అది ప్రతిసారీ లాఠీలతోనో తుపాకులతోనో దర్శనమిస్తుందనుకుంటే పొరబాటు. ఇది మనసుల్ని నిర్భందించే నిరంకుశత్వం. అలాగే... వాస్తవమేదో, అవాస్తవమేదో తెలియనీకుండా మీడియాలో గందరగోళ పరచడమనేది ఇంకోరకమైన ఆధిపత్యం. మనసుల్ని, ఆలోచనల్ని అదిమిపట్టి... కోరికల్ని దిగమింగుకొని, ఎవరికోసమో మన అభిప్రాయాలను మార్చుకోవడం, చివరకు ఎందుకోసం మార్చుకున్నామో కూడా తెలియకపోవడం... సగం చచ్చిబతకడమే. ఇక ప్రజాస్వామ్యం ఎలా వర్థిల్లుతుంది? ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే స్వేచ్ఛాయుత వాతావరణం వుండాలి. దానికోసం పోరాడాలి. ఆధిపత్యం ఎక్కడ ఏ రూపంలో కనిపించినా ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించే అవకాశాన్ని పెద్దరికం, ఆచారం, సంస్కృతి, సంప్రదాయం పేరుతో నోరు మూయించినా, కుల కట్టుబాటు పేరుతో నోరు నొక్కేసినా... అది అప్రజాస్వామికం. దాన్ని మనం ఖండించాల్సిందే. 'ఎక్కడైతే మనస్సు నిర్భయంగా ఉంటుందో... ఎక్కడైతే మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగగలడో... అలాంటి స్వేచ్ఛ, స్వాతంత్య్రాల స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించు' అన్న విశ్వకవి మాటలు.. ఆధిపత్యానికి సవాలుగా, స్వేచ్ఛకు వారధిగా మారాలి.










