May 14,2023 02:10
మాట్లాడుతున్న పనబాక లక్ష్మి

ప్రజాశక్తి-బాపట్ల: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే బాపట్ల లోక్‌ సభ నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమేనని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. శనివారం బాపట్ల తెదేపా కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వేగేసేన నరేంద్ర వర్మతో కలిసి విలేకరుల సమావేశంలో పనబాక మాట్లాడారు. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పై వైకాపా నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో బాపట్ల సీటు కేటాయించాలని అధినేత చంద్రబాబుని అడుగుతానన్నారు. పార్టీ ఆదేశానుసారం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానన్నారు.బాపట్ల సూర్యలంక తీరంలో నిర్మించిన తారకేశ్వర స్వామి దేవస్థానం ప్రారంభోత్సవ కార్యక్రమంతోపాటు ఆదివారం వేగేశన ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నరేంద్ర వర్మ నిర్వహిస్తున్న మహా రుద్రాభిషేకం కార్యక్రమంలో పాల్గొంటానన్నారు.
టిడిపి సభలకు జనాన్ని చూసి వైసీపీకి వణుకు
తెలుగుదేశం పార్టీ సభలకు వస్తున్న జనాన్ని చూసి వైసీపీకి వెన్నులో వణుకు పుట్టి రాజ్యాంగ విరుద్ధంగా జీవో నెంబరు 1 తెచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కలాని జగన్మోహన్‌రెడ్డి చూస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు తీరని ద్రోహం చేస్తున్నారు. వారికి న్యాయంగా రావాల్సిన హక్కులు కూడా వారికి అందడం లేదని, సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గొలపల శ్రీనివాసరావు, ఇనగంటి గాంధీ, తోట నారాయణ, మోదుగుల శంకర రెడ్డి, ఫరీద్‌ మస్తాన్‌, జిట్టా ప్రమీల రాణి, పల్లం సరోజిని, రామ సుబ్బారావు,ముసలయ్య, ఆంద్రేయ్య,ఉమ్మారెడ్డి వెంకటేష్‌,దొమ్మలపాటీ శ్రీనివాసరావు, వెంకట్రావు, హైమావతి పాల్గొన్నారు.