
ప్రజాశక్తి - భీమవరం
మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి సంయుక్తంగా మ్యూటేషన్స్, స్టోన్ ప్లాంటేషన్, స్వమిత్వ, ఎలక్షన్, హౌసింగ్ తదితర అంశాలపై సంబంధిత డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ అంశాల వారీగా డివిజన్, మండల స్థాయి అధికారులను ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. అంశాలవారీగా ఆర్‌డిఒలకు, తహశీల్దార్లకు, ఎంపిడిఒలకు, పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మ్యూటేషన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల డాక్యుమెంట్లను పూర్తి స్థాయిలో పరిశీలించి మ్యూటేషన్స్ చేయాలన్నారు. జిల్లాలో అధికంగా 40 శాతం మ్యూటేషన్లు రిజెక్ట్ చేసినట్లు చెప్పారు. వాటిని మళ్లీ ఒకసారి పున:పరిశీలించి అవకాశం ఉన్న వాటిపై దృష్టి సారించాలని అన్నారు. తోకలపూడి, నరసింహపురం, పంజా వేమవరం తదితర గ్రామాల్లో 80 శాతం ప్రగతి కనబరిచిన అధికారులను అభినందించారు. ప్రభుత్వ భూములు, ప్రయివేట్ ఇళ్ల స్థలాలు పక్కాగా సర్వే చేయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఎనామలీస్ డేటా జిల్లా నుంచి విడుదల చేసిన డేటాకు నూటికి నూరు శాతం రిఫ్లెక్ట్ అయ్యేలా మండల స్థాయి ఎలక్షన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా సర్వే అధికారి జాషువా, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.