ప్రజాశక్తి-హుకుంపేట:రోడ్లు అనుమతులకు ఆటవీ శాఖ అధికారులు సహకరించాలని అనంతగిరి జడ్పీటీసీ దీసరి గంగరాజు కోరారు. అనంతగిరి మండలం మారుమూల పంచాయతీలు శంకుపర్తి, పట్కదవడ, దొనిమోరి బొంగిజ తదితర గ్రామాలకు మంజూరైన రోడ్లకు అనుమతులు మంజూరు చేయాలని అనంతగిరి మండలం బొర్ర ప్రాంతంలో ఫీల్డ్ పర్యటనకు వచ్చిన అట్టవీశాఖ డి.ఎఫ్.ఒ వినోద్ కుమార్‌కు అనంతగిరి జడ్పిటిసి దీసరి గంగరాజు వినతిపపత్రాన్ని అందజేశారు. అనంతరం గంగరాజు మాట్లాడుతూ, మారుమూల గుమ్మకోట పంచాయతీ గుమ్మకోట నుండి శంకుపర్తి వరకు 2016-17 సంవత్సరంలో నిధులు మంజూరై 8 సంవత్సరాలు కావస్తున్నా అటవిశాఖ అధికారులు అనుమతుల పేరుతో అభివృద్ధిని అడ్డుకొంటు రోడ్డు నిర్మాణాలు ఆపుతున్నారన్నారు. గ్రామంలో పర్యటించి దర్యాప్తు చేసి తక్షణమే అనుమతులు ఇప్పంచాలని డిఎఫ్.ఒ వినోద్ కుమార్‌ను కోరారు.గిరిజనుల పట్ల చిత్తశుద్ధి లేని అధికారులతోనే గిరిజన వ్యవస్థ కుంటుపడుతుందన్నారు. ఒక్క పక ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు డోలీ మోతలు లేని గ్రామాలుగా ఉండాలని నిధులు మంజూరు చేసి రోడ్లు నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినా ఫారెస్ట్ అధికారులు ఆటంకంగా మారుతున్నారని అయన అన్నారు. దీంతో గిరిజనులు ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు ఈ విషయమై ప్రస్తావించినా స్పందించక పోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు రోడ్లు అనుమతులు మంజూరు చేయకపోతే జిల్లా పరిషత్, పాలక వర్గాల సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టోకూరు సర్పంచ్ కిల్లో మోస్య, బొర్ర సర్పంచ్ జన్ని అప్పారావు, నరాజి సురేష్, గిరిజనులు, తదితరులు పాల్గొన్నారు.










