Nov 16,2022 17:39

నష్టపరిహారం చెల్లించకుంటే రోడ్డుపై బైఠాయిస్తాం
పొక్లెయిన్‌ వద్ద అంబేద్కర్‌ కాలనీ వాసుల నిరసన
ప్రజాశక్తి - ముదినేపల్లి

               గత రెండు రోజులుగా కూలీ, నాలీ మాని, తిండి, తిప్పలు, నిద్రహారాలు లేకుండా రోడ్డుపై పసి పిల్లలతో పడిగాపులు పడుతూ రోదిస్తుంటే అధికారులు మాగోడు పట్టించుకోరా అంటూ ముదినేపల్లిలోని అంబేద్కర్‌ కాలనీ నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కాలనీ వద్ద పని చేస్తున్న పొక్లెయిన్‌ దగ్గర నివాసితులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు అధికారులు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని, లేకపోతే రోడ్డు విస్తరణ పనులు అడ్డుకుంటామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమకు నోటీసులు కూడా ఇవ్వకుండా ఉన్నపలంగా ఇళ్లు ఖాళీ చేయమంటే ఎలా అని వాపోయారు. పాదయాత్రలో జగన్‌ పేదలకు సహాయం చేస్తానన్నారు.. ఇదేనా సహాయమంటే, పేదల ఇళ్లు లాక్కోవడమా అంటూ పలువురు మహిళలు ప్రభుత్వంపై, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలైన తమకు న్యాయం జరిగే వరకు, నష్ట పరిహారం చెల్లించే వరకు పోరాటం చేస్తామన్నారు. కాంట్రాక్టు తరపు ప్రయివేటు సర్వేయర్లు తమపై దురుసుగా ప్రవర్తిస్తూ తమను భయందోళనలకు గురి చేస్తున్నారన్నారు. అడ్డగోలు సర్వే కారణంగా తమ బతుకుల రోడ్డునపడే పరిస్థితి వచ్చిందని, నష్టపరిహారం చెల్లించకపోతే తాము ఇళ్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదన్నారు. తమకు స్థలాలు చూపించి, గృహాలు కట్టించి ఇవ్వాలని, లేకపోతే పిల్లపాపలతో రోడ్డుపై కూర్చుంటామన్నారు. అధికారులు స్పందించి పేదలైన తమకు నష్ట పరిహారం చెల్లించి న్యాయం చేయాలని, లేకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇళ్లు పడేసి కట్టుకునేంతా ఆర్థిక స్థోమత తమకు లేదన్నారు. నష్ట పరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభిస్తే ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు.