Jun 10,2023 20:54

ఖాళీ బిందెలతో ఉన్న ప్రజలు

ప్రజాశక్తి - కౌతాళం
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల దాహం తీర్చేందుకు ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నా అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆశయాలు నీరుగారుతున్నాయి. ఇందుకు నిదర్శనమే హనువాల్‌ సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ కాంట్రాక్టర్‌. ఈ సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ ద్వారా కౌతాళం మండలంలోని తోవి, ఎరిగేరి, బదినేహాల్‌, కుంటనహళ్‌ గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. ఈ ట్యాంక్‌ నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. గ్రామాలకు మాత్రం తాగునీరందకపోవడంతో ప్రజలు దాహంతో ఇబ్బంది పడుతున్నారు. వేసవి కావడమే కాకుండా గ్రామాల్లో ఉత్సవాలు, జాతరలు, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో తాగునీరు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామాలకు వచ్చిన బంధుమిత్రులకు కనీసం తాగునీరు కూడా అందించలేని పరిస్థితిలో గ్రామస్తులు ఉన్నారు. తోవి గ్రామానికి సుమారు 15 రోజులవుతున్నా తాగునీరు రాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి కోసం రాత్రనక, పగలనక వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఎరిగేరి గ్రామంలో పరిస్థితి కూడా దారుణంగా ఉంది. కుంటనహాల్‌ గ్రామంలో 'గడపగడపకు'లో ప్రజలు అధికారులు, పాలకుల దృష్టికి తాగునీటి సమస్యను తీసుకెళ్లారు. సంబంధిత అధికారులు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, ఈ గ్రామాలకు తాగునీరందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.