
* తహశీల్దార్ తీరుపై స్పీకర్ మండిపాటు
ప్రజాశక్తి- సరుబుజ్జిలి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి తహశీల్దార్ వి.లక్ష్మీనారాయణ గైర్హాజరవ్వడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సరుబుజ్జిలి మండలం డకరవలస, సుభద్రాపురం గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డకరవలస గ్రామంలో పర్యటిస్తుండగా షలంత్రి గ్రామంలో వై.నారాయణమ్మ అనే వృద్ధురాలు మరణించి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ అధికారులు కార్డు రద్దు చేయకుండా బియ్యాన్ని స్వాహా చేస్తున్నారని కె.గౌరునాయుడు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పీకర్ వెంటనే తహశీల్దార్‌ను పిలవగా కార్యక్రమానికి రాలేదని పలువురు తెలుపడంతో వెంటనే పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్‌ను పిలవగా ఆయన కూడా కార్యక్రమానికి రాకపోవడంతో స్పీకర్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ బాబురావును వివరణ కోరగా తనకేమీ తెలియదని చెప్పడంతో స్పీకర్ మరింత అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సుభద్రాపురం గ్రామంలో వంశధార కాలువ నుండి రైతులకు సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా రైతులను ఆదుకోవాలని అక్కడి రైతులు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పీకర్ వెంటనే ఇరిగేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి రైతులకు అవసరమైన సాగునీటిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఎనిమిది నెలలగా సిఎఫ్ లేకపోవడంతో డ్వాక్రా సభ్యులంతా ఇబ్బంది పడుతున్నామని సిఎఫ్‌ను వెంటనే నియమించాలని మహిళలు స్పీకర్‌ను కోరారు. అనంతరం గడపగడపకు వెళ్లి ప్రజలకు ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సురవరపు నాగేశ్వరరావు, వైస్ ఎంపిపిలు గోవింద్ శివానందమూర్తి, లావేటి అనిల్ కుమార్, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, ఎంపిడిఒ పివిపి మురళీమోహన్ కుమార్, మూడడ్ల రమణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.