ప్రజాశక్తి-పాడేరు: జగనన్నకు చెబుదాం, స్పందన ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. స్పందన ఫిర్యాదులకు సక్రమంగా ఎండార్స్మెంటు వేయని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. శుక్ర వారం ఐటిడిఏ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందనలో 135 ఫిర్యాదులు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ జె.శివశ్రీనివాసు, ఐటిడిఏ పి.ఓ.వి.అభిషేక్, ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి ఎం.వేంకటేశ్వరరావు, డిఆర్.పి. అంబేద్కర్ వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, స్పందన ఫిర్యాదులపై ప్రధాన కార్యదర్శి ప్రతీ వారం సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా అధికారులు ప్రతి నెలా రంపచోడవరం, చింతూరు డివిజన్లలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరిం చాలన్నారు. గ్రామ సచివాలయం సిబ్బందితో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి నియోజక వర్గాల వారీగా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షిస్తారని జిల్లా అధికారులు ఆ మేరకు సన్నద్ధం కావాలన్నారు.
135 అర్జీలు స్వీకరణ ......
స్పందనలో 135 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. తాగునీటి సమస్యలు, విద్యుత్తు సదుపాయాలు, వ్యక్తి గత సమస్యలు, ఉపాధి అవకాశాలు, భూ సమస్యలు, కళాశాలలు, పాఠశాలలు ప్రవేశాలకు అర్జీలు సమర్పించారు.
హుకుంపేట మండలం కంగారుపుట్టు గ్రామానికి సిసి రోడ్లు, డ్రైనేజీలు మంజూరు. చేయాలని కొర్రా అప్పారావు అర్జీని సమర్పించారు.పాడేరు మండలం చింతలవీధి గ్రామంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్థంభాన్ని తొలగించాలని కొమ్ము సురేష్ బాబు వినతిపత్రం అందజేసారు. చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ పెదురు పల్లి గ్రామం నుండి తామరాపల్లి గ్రామం వరకు రోడ్డు నిర్మించాలని ఉబలగరువు గ్రామస్తుడు వంతాల లక్ష్మణరావు కోరారు. డుంబ్రిగుడ మండలం సర్రాయి గ్రామంలో ప్రాధమిక పాఠశాల ప్రమాద కరంగా ఉందని కొత్త భవనం మంజూరు చేయాలని గ్రామస్తులు పి.భగవతి, ఎం.ముద్దుల క్రిష్ణ తదితరులు ఫిర్యాదు చేసారు. జి.కె. వీధి మండలం దేవరాపల్లి పంచాయతీ వేలుగురాతి బంద గ్రామస్తులు లకే బాబూరావు, లకే ప్రసాదు తీములబంద జంక్షన్ నుండి వేలుగురాతి బండ గ్రామం వరకు రోడ్డు నిర్మించాలని కోరారు. జి. మాడుగుల మండలం బొయితిలి పంచాయతీ మద్దిగరువు గ్రామస్తులు సి.హెచ్. చంటి, కె.లత తదితరులు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. పలువురు తమ సమస్యలన విన్నవించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిడి ఐ. కొండలరావు, ఇ.ఇ.డి. వి.ఆర్. రాజు, పంచాయతీ రాజ్ ఇ.ఇ. టి.కొండయ్య పడాల్, రహదారులు భవనాల శాఖ ఇ.ఇ బాల సుందరబాబు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇఇ. లీలా క్రిష్ణ, డిపిఓ కొండలరావు, డివిజినల్ పంచాయతీ అధికారి పి. ఎస్.కుమార్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి. ఎస్.నంద్, జిల్లా ఉద్యానవన అధికారి రమేష్ కుమార్‌రావు, పాడేరు తహశీల్దార్ త్రినాధరావు నాయుడు, హుకుంపేట తహశీల్దార్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










