ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే దిశగా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ఉమ్మడి జిల్లాల జెడ్పి చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర సూచించారు. స్థానిక ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి, ఐసిడిఎస్, విద్యా, రెవిన్యూ శాఖల అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ, విద్యా, ఐసిడిఎస్ శాఖలకు సంబంధించి ఎటువంటి సమస్యలు తలెత్తిన వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఆమె సూచించారు. అనంతరం సుభద్ర మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్తుందని, వీటిని అమలు పరచాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. చిత్తశుద్ధితో పని చేస్తే అధికారులకు, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ కిరణ్ కుమార్, ఎంఈవో చెల్లయ్య, తహశీల్దార్ నర్సమ్మ, ఐసిడిఎస్ సిడిపివో రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి సర్పంచ్లు ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర పేర్కొన్నారు. మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులతో సుభద్ర సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ఆయా గ్రామాల అభివృద్ధికి తయారు చేయాల్సిన ప్రణా ళికలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి పాటుపడాలని తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయానికీ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నారని, అవి గ్రామాల అభివృద్ధికి ఉపయోగిం చుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో కిరణ్ కుమార్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.










