Sep 30,2022 23:08

సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి-పాడేరు: అధికారులు బాధ్యతా యుతంగా పని చేసి స్పందన సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. ఐటిడిఎ సమావేశ మందిరంలో ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌, డిఆర్‌ఒ బి.దయానిధితో కలిసి శుక్రవారం వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 67 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. రెవెన్యూ, ఇంజనీరింగ్‌, సంక్షేమ శాఖలపై కోర్టు కేసులు ఉన్నాయని, వీటి పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. మండల స్థాయిలో సర్వేయర్లతో సమావేశాలు నిర్వహించాలని సబ్‌కలెక్టర్‌కు సూచించారు. సచివాలయం, మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం చేయాలని ఆదేశించారు.
స్పందనకు 67 వినతులు
స్పందనకు 67 వినతులు అందాయి. జికె.వీధి మండలం జర్రెల పంచాయతీ రహదారి అటవీ శాఖ అనుమతులు లేక అసంపూర్తిగా నిలిచిపోయిందని రోడ్డు పనులు పూర్తి చేయాలని ఎంపిటిసి ఎ.లోవలక్ష్మి వినతిపత్రం సమర్పించారు. జికె వీధి పంచాయతీ నూతులు గ్రామానికి రహదారి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని, రహదారి నిర్మించాలని గ్రామస్తులు గుంట బుజ్జిబాబు, కె.మోహనరావు వినతిపత్రం సమర్పించారు. కొయ్యూరు మండలం గదబపాలెం సర్పంచ్‌ ఉల్లి నర్సమ్మ పంచాయతీ పరిధిలోని డ్రైనేజీలు, పంట చెరువులు, మంచినీటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. జికె వీధి మండలం మెండి గెడ్డ సర్పంచ్‌ అడపా ప్రియాంక జర్రెల కాలనీ, తోటల గొంది గ్రామాలలో అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవన నిర్మాణాలు పూర్తి చేయాలని వినతి పత్రం అందజేసారు. జి.మాడుగుల మండలం సింగర్భ పంచాయతీ మొండికోట గ్రామానికి చెందిన ఆశాకార్యకర్త కిముడు అనసూయ తనకు 2019, 2020 సంవత్సరాలకు సంబంధించిన జీతాలు విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించారు.
జి.మాడుగుల మండలం పెదలోచలి పంచాయతీ పనసలపాడు గ్రామానికి చెందిన కొర్రా బుల్లమ్మ ఆశ కార్యకర్త ఉద్యోగం కోసం దరఖాస్తు చేసారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు, ఇఇలు డివిఆర్‌ఎం రాజు, కె.వేణుగోపాల్‌, రహదారులు భవనాల శాఖ ఇఇ బాల సుందరబాబు, డిఇఒ పి.రమేష్‌, ఎడిఎంహెచ్‌ఒ డా.లీలాప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ దృష్టికి సమస్యలు
హుకుంపేట:మారుమూల గ్రామాల్లో సమస్యలపై పాడేరులోని స్పందనలో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌కు జడ్పిటిసి వేగం మత్య్సలింగం విన్నవించారు. బరామసి పంచాయతీ నిలమపుట్టు గ్రామంలో రోడ్డు మంజూరు చేయాలని, మండలం లో తాగునీటి సమస్యపై వివరించారు.