Sep 19,2023 21:00

అధికారులను ప్రశ్నిస్తున్న సభ్యులు

ప్రజాశక్తి- రేగిడి : మనబడి, నాడు- నేడు రెండవ విడత పనుల బిల్లు చెల్లింపులలో జాప్యంపై సమగ్ర శిక్షా జెఇ దాలయ్య, వ్యవసాయ అధికారి మురళీకృష్ణపై సభ్యులు ధ్వజనమెత్తారు. బుధవారం ఎంపిపి ధార అప్పలనరసమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నాడు, నేడులో అంబాడ వెంకటాపురం ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ నిర్మించామని నేటి వరకు బిల్లులు కాలేదని సర్పంచ్‌ చుక్కా వెంకట నాయుడు సభ దృష్టికి తెచ్చారు. దీంతో జెఇ మాట్లాడుతూ గతంలో పనిచేసిన బిల్లులు చెల్లించాలని అన్నారు. దీనిపై వైస్‌ ఎంపిపిలు అచ్చెం నాయుడు, జగన్మోహన్‌రావు కలుగజేసుకొని కూర్చొని బిల్లు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ సమీక్షలో ఎఒ మురళీకృష్ణ మాట్లాడుతుండగా సభ్యులు అడ్డు తగిలి రెండో విడతలో ఎరువులు రాకపోవడంతో పంటలు తెగుళ్లు బారిన పడుతున్నాయని అందుకు ఎరువులు తెప్పించి పంపిణీ చేయాలని కోరారు. ఎరువులు పూర్తిస్థాయిలో రాలేదని సమీక్షలో ఏవో వెల్లడించారు. కందిస గ్రామానికి ఎరువులు పూర్తిగా రైతు భరోసా కేంద్రం నుంచి ఎంతవరకు అందజేయలేదని ఎంపిటిసి కెల్ల మన్మధరావు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎరువులు లేవని ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఎడితో మాట్లాడితే ఎరువులు తెప్పించాలని కోరారు. రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న వ్యవసాయ అసిస్టెంట్లు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. సచివాలయ ఉద్యోగులు ఎవరి ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తున్నారని క్రమశిక్షణలో లేరని సెలవులు ఎంపిడిఒకు తెలియకుండా పెట్టేస్తున్నారని అన్నారు. కనీస ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా చూస్తున్నారన్నారు. డిడిఒ అనుమతి లేనిదే సెలవులు ఇవ్వరాదని వైస్‌ ఎంపిపిలు వెల్లడించారు.
పశువైద్య శాఖ సమీక్షలో మండల విప్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పశువులకు పలు రకాల వ్యాధులు సోకుతున్నాయని పశువైద్యాధికారులు పట్టించుకోలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. సంకిలి గ్రామంలో పశువైద్య కేంద్రానికి వైద్యులతో పాటు సిబ్బంది పూర్తిస్థాయిలో లేక మూగజీవాలు ఇబ్బందులు పడుతున్నాయని వెల్లడించారు. నాగేశ్వరావు ఐసిడిఎస్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, వెలుగు, మత్స్యశాఖ, ఇరిగేషన్‌, విద్య, వైద్యం, ఇరిగేషన్‌ పలు శాఖల పనితీరుపై నామ మాత్రమే సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ హాజరయ్యారు. పలు శాఖల అధికారులు గ్రామస్థాయి ప్రజాప్రతినితో మమేకమై గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ శ్యామల కుమారి, ఆర్‌డబ్ల్యుఎస్‌ జెఇ శ్రీ చరణ్‌, ఎంఇఒ ఎం. వరప్రసాదరావు, మండల నాయకులు, సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.