Feb 12,2023 00:20

మండల సమావేవంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సభ్యుడు

ప్రజాశక్తి -ఎస్‌.రాయవరం:
మండలంలో వివిధ శాఖల అధికారుల పనితీరుపై మండల సర్వ సభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు నిలదీశారు. గృహ నిర్మాణం, పశువైద్యం, ఆర్బీకే, మత్స్యశాఖ తదితర అధికారులపై ప్రజాప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. మండల ప్రజాపరిషత్‌ సమావేశ మందిరంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. మండల అధ్యక్షురాలు కోన లోవలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొని నివేదికలు చదివి వినిపించారు. సైతారుపేటలో పశువైద్యం సరిగా లేదని, అధికారులు వచిన్నపుడు సర్పంచులకు తెలియ చేయలేదని, తాము తోలుబొమ్మలా మారామని సర్పంచ్‌ రావి రమణబాబు అధికారుల పనితీరును ఎండగట్టారు. ఆర్భీకేలు ఉత్సవ విగ్రహాల మాదిరిగా ఉన్నాయని, రైతాంగానికి ఏ మాత్రం ఉపయోగం లేదన్నారు. మత్స్యశాఖ అధికారులు తమ సమస్యల పరిష్కారం లో ఏమి చేశారంటూ వాకపాడు సర్పంచ్‌ మైలపల్లి శ్రీను లేవనెత్తారు. ఎవరేమి అడిగినా అధికారులు తమతమ శాఖల పురోగతిని చదివి వినిపించి మమ అనిపించారు. మొక్కుబడిగా తూతూ మంత్రంగా ఇలాంటి సమావేశాలు నిర్వహించడంపై సభ్యులు ధ్వజ మెత్తారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో శ్రీరామచంద్రమూర్తి, జెడ్పీటిసి కాకర దేవి, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.