
ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకునే జగనన్న కాలనీల్లో లబ్ధిదారులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక్కో లబ్ధిదారుడు ఒక్కో విధమైన సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పట్టాలిచ్చినా స్థలం బాగోకపోవడంతో నిర్మాణాలు చేపట్టలేక ఇబ్బందులు పడుతుంటే మరిన్ని కొన్ని చోట్ల పట్టాలిచ్చి స్థలాలూ బాగున్నా సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం విఫలమవడంతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. కాగా మరి కొన్ని చోట్ల లబ్ధిదారులను గుర్తించినా ఇప్పటికీ వారికి పట్టాలు ఇవ్వకపోవడంతో నాలుగేళ్లగా పట్టాలు కోసం ఎదురుచూస్తున్నారు. ఇన్ని సమస్యలతో జగనన్న కాలనీ లబ్ధిదారులు అవస్థలు పడుతున్నా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
ప్రజాశక్తి - వేపాడ : మండలంలోని అరిగి పాలెంలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అధికారులు 30 మంది అర్హులను గుర్తించారు. వీరందరికీ గ్రామ కంఠం భూమిని ఇచ్చేందుకు అధికారులు సర్వే కూడా చేశారు. అయితే గ్రామ కంఠం అనుభవంలో ఉన్న రైతులు మాత్రం ఆ భూమి తమ తాత తండ్రుల నుంచి తమ అనుభవంలోనే ఉందని అది ఇళ్ల స్థలాలకు ఇవ్వడం కుదరదని తేల్చి చేప్పేశారు. దీంతో అక్కడ ఇప్పటి వరకూ స్థలాలు ఇవ్వలేదు.
సోంపురం గ్రామంలో జగనన్న కాలనీ కోసం 40 మందిని గుర్తించారు. వీరికి కేటాయించిన స్థలం ఊరికి దూరంగా రాతి క్వారీ దగ్గర ఉండటంతో అక్కడ క్వారీల పేలుళ్ల వల్ల ప్రమాదాలు జరుగుతాయని లబ్ధిదారులు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. దీంతో అక్కడ నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.
పికెఆర్‌పురంలో లోతట్టు ప్రాంతంలో లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వడం వల్ల వర్షం పడితే ఇళ్ల స్థలాలు మొత్తం నీటమునిగిపోతున్నాయి. దీంతో అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ముకుందపురంలో కూడా ఊరుకు దూరంగా ముళ్ల పొదలు, గుట్టల్లో, రాళ్ల బండల మధ్య ఇంటి స్థలాలు ఇవ్వడం వల్ల లబ్ధిదారులు అక్కడకు వెళ్లడానికి ఇష్ట పడలేదు.
అధికారులు తొందరపాటు నిర్ణయాలతోనే అవస్థలు
ప్రభుత్వం చెప్పిన వెంటనే అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేయకుండా హడావుడిగా తొందరపాటు నిర్ణయాలతో ఇష్టానుసారంగా స్థలాలను గుర్తించడం వల్ల లబ్ధిదారులు ఇప్పుడు ఇంటి నిర్మాణాలు చేసుకోలేకపోతున్నారు. కనీసం ఇంటి నిర్మాణం చేసుకునేందుకు వీలు లేని ప్రాంతాలను గుర్తించి పేదలకు ఇవ్వడంతో చాలా మంది లబ్ధిదారులు నిర్మాణాలకు వెనుకడుగు వేస్తున్నారు. గ్రామాలకు, పట్టణ ప్రాంతాలకు ఆనుకుని వందల ఎకరాల్లో ప్రభుత్వ భూములున్నా పేదలకు మాత్రం కొండల్లో, గుట్టల్లో, చెరువు గర్భంలో అసలు నిర్మాణానికి పనికి రాని చోట స్థలాలు ఇవ్వడంతో ఎవరూ నిర్మాణాలకు ముందుకు రాలేదన్న వాదన వినిపిస్తుంది.
నెలాఖరుకు ఎలా సాధ్యం
మండలంలో చాలా గ్రామాల్లో జగనన్న కాలనీల్లో నిర్మాణాలు పూర్తి కాలేదు. కొన్ని చోట్ల నిర్మాణాలు ప్రారంభించన పరిస్థితి ఉంది. ఇటువంటి సమయంలో ఈ నెలాఖరుకు జగనన్న కాలనీల్లో ఇళ్లను ప్రారంభించాలని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆదేశించడం హాస్యాస్పదంగా ఉంది. మండలంలోని బొద్దాం గ్రామం తప్ప మిగతా గ్రామాల్లో పూర్తిస్థాయిలో గృహ నిర్మాణాలు జరగలేదు. నిర్మాణాలకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కూలీల రేట్లు, మేస్త్రి రేట్లు, మెటీరియల్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో చాలా మంది నిర్మాణాలకు ముందుకు రాలేదు. దీంతో జగనన్న కాలనీల్లో నిర్మాణాలు ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న నగదును పెంచాలని, పట్టాలివ్వని లబ్థిదారులకు పట్టాలివ్వాలని, అనువైన స్థలాలను కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.