Jul 01,2023 00:33

మాట్లాడుతున్న వైసిపి నాయకులు దాడి రత్నాకర్‌

ప్రజాశక్తి- అనకాపల్లి : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల పనులు జరగలేదని, అధికారులకు ప్రజా సమస్యలు పట్టవా? అని వైసిపి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జీవీఎంసీ జోనల్‌ కార్యాలయాన్ని సందర్శించి అన్ని విభాగాలను పరిశీలించారు. సిబ్బంది సకలానికి హాజరు కాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో స్పందించి ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్‌, ఎంపీ డాక్టర్‌ సత్యవతి ప్రజా సమస్యలపై అధికారులకు సూచనలు చేస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. అనకాపల్లి జోన్‌కు ఫాగింగ్‌ మిషన్లు ఎందుకు మంజూరు కాలేదో ప్రధాన కమిషనర్‌ సమాధానం చెప్పాలన్నారు. చెర్లోపల్లి కాలువ ఎల్లయ్య కాలువలతో పాటు డ్రైనేజీల పూడికలు తీయలేదని, దీనిపై పలుమార్లు రైతులు అధికారులకు వినతిపత్రాలు అందజేసిన పట్టించుకోకపోవడం శోచనీయం పేర్కొన్నారు. తక్షణమే అధికారుల తీరు మార్చుకోకుంటే ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు కొణతాల భాస్కరరావు, రైతు సంఘం నాయకులు భీశెట్టి కృష్ణ అప్పారావు, మల్ల రాజా, మాజీ కౌన్సిలర్‌ రాజా సతీష్‌, కోటిపల్లి జేజి బాబు, గవర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఎస్‌.బాబి, కర్రి శివన్నారాయణ పాల్గొన్నారు.