Oct 06,2023 23:57

ఆందోళన చేస్తున్న ఆశ కార్యకర్తలు, యూనియన్‌ నాయకులను ఆరెస్టు చేస్తున్న పోలీసులు... కృపమ్మ మృతదేహం (ఇన్‌సెట్‌)

ప్రజాశక్తి - తాడేపల్లి : ఉన్నతాధికారుల వేధింపులు, పని వత్తిడి వల్లే తాడేపల్లి ప్రకాష్‌నగర్‌లోని వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఆశ కార్యకర్తగా పని చేస్తున్న తాడేపల్లి పట్టణంలోని ముగ్గురోడ్డుకు చెందిన రేపూడి కృపమ్మ (38) మృతి చెందారని ఆశావర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి తెలిపారు. కృపమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి ప్రకాశనగర్‌ సెంటర్‌లో జరుగుతున్న ఆందోళన వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. కృపమ్మ మృతికి అధికారులు న్యాయం చేయడానికి ముందుకు రాకపోవడం విచారకమన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. జగనన్న సురక్ష పేరుతో పనివత్తిడి పెంచి ఆశాల మరణానికి కారణమైన ప్రభుత్వమే భాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కృపమ్మ మృతికి బాధ్యులైన మెడికల్‌ అధికారి, హెల్త్‌ విజిటర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారం చేయకపోతే ఆశా వర్కర్లచేత రాష్ట్ర ప్రభుత్వం పని ఎలా చేయించుకుంటుందో చూస్తామని హెచ్చరించారు. ధనలక్ష్మి మాట్లాడుతున్న సమయంలోనే తాడేపల్లి సిఐ శేషగిరిరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ రాత్రి 11 గంటల సమయంలో కూడా ఆశా వర్కర్ల యూనియన్‌ నాయకులు, ఆశా కార్యకర్తలు స్టేషన్‌ ముందు ధర్నాకు దిగారు. అరెస్టయిన వారిలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ, తాడేపల్లి పట్టణ కార్యదర్శి వి.దుర్గారావు, ఐద్వా రాష్ట్ర నాయకులు డి.శ్రీనివాసకుమారి, స్థానిక నాయకులు కె.కరుణాకరరావు, బి.వెంకటేశ్వర్లు, మొత్తం 21 మందిని అదుపులోకి తీసుకున్నారు.