ప్రజాశక్తి-ఆలూరు
సైనికునిగా పని చేసిన తనకు ప్రభుత్వం ఇచ్చిన 2.96 ఎకరాల భూమిలో అధికారుల తప్పిదాలతో 53 సెంట్ల భూమి మాయం చేసినట్లు మాజీ సైనికుడు బి.మహేష్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 53 సెంట్ల భూమి కోసం 13 ఏళ్లుగా అధికారులకు, ముఖ్యమంత్రి, కలెక్టర్లకు విన్నవించినా న్యాయం జరగలేదని తెలిపారు. తనకు న్యాయం చేయకపోతే ఆలూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని చెప్పారు. పట్టణ శివార్లలో 1979లో ప్రభుత్వం దళితులకు ల్యాండ్ సీలింగ్ ద్వారా 27 ఎకరాలు ఇవ్వగా తనకు ప్రభుత్వం హత్తి బెళగల్ గ్రామానికి చెందిన సర్వే నెంబరు 622లో 2.96 ఎకరాల భూమిని ఇచ్చారన్నారు. అప్పటి నుంచి ఆ భూమిని తానే సాగు చేసుకుంటూ ఆలూరు స్టేట్ బ్యాంకులో 2.96 ఎకరాలకు పంట రుణం కూడా తీసుకున్నట్లు తెలిపారు. 2011లో తనకు కేటాయించిన భూమిలో 53 సెంట్ల భూమిని వేరే వారి భూమిలో రెవెన్యూ అధికారులు కలిపారన్నారు. ప్రస్తుతం తనకు 2.43 ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపుతోందని తెలిపారు. ఈ అవకతవకలపై 2015లో రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సర్వే చేయిస్తే తన భూమిలో ఉండాల్సిన 53 సెంట్లు పక్కనే ఉన్న హత్తి బెళగల్‌కు చెందిన నల్లన్న కుమారుడు గుండప్ప పొలంలో కలిసినట్లు తేలిందని తెలిపారు. గుండప్పకు ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ భూమి ఇస్తే ఆ భూమి ప్రస్తుతం ప్రభాకరయ్య పేరుతో ఉందని చెప్పారు. గుండప్ప పేరు మార్చుకొని ప్రభాకరయ్యగా చలామణి అవుతూ తమ భూమిలోని 53 సెంట్ల భూమిని కబ్జా చేసి తన భూమిలో కలుపుకున్నారని తెలిపారు. ఆర్‌టిఐ యాక్ట్ ప్రజాదర్బార్, స్పందన వంటి కార్యక్రమాల్లో కలెక్టర్, ఆర్‌డిఒలకు అర్జీలు ఇస్తూనే ఉన్నామని, ఏ ఒక్క అధికారి కూడా స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అధికారుల వద్దకు తిరిగి విసిగిపోయానని, అధికారుల నిర్లక్ష్యంపై తహశీల్దార్ కార్యాలయం వద్ద న్యాయం జరిగే వరకు ఆమరణ దీక్ష చేపడతామని తెలిపారు. ఆ క్రమంలో తన ప్రాణం పోయినా ఫర్వాలేదన్నారు. ఉన్నతాధికారులు తన సమస్యపై స్పందించాలని కోరారు.
ప్రభుత్వం ఇచ్చిన పట్టదారు పాసు పుస్తకాన్ని చూపుతున్న మాజీ సైనికుడు మహేష్










